నోట్ల ర‌ద్దు కాగానే.. శ‌శిక‌ళ కొన్న ఆస్తుల జాబితా!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దాదాపు మూడేళ్ల కింద‌ట నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించిన‌ప్పుడు ఇబ్బందులు ప‌డింది సామాన్యులే.. డ‌బ్బున్న వాళ్లు, న‌ల్ల‌ధ‌నికులు అలాంటి ఇబ్బందులు ఏమీ ప‌డ‌లేదు, వారి వ్య‌వ‌హారాలు చాలా సాఫీగా సాగిపోయాయ‌ని అనేక ఉదంతాలు…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దాదాపు మూడేళ్ల కింద‌ట నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించిన‌ప్పుడు ఇబ్బందులు ప‌డింది సామాన్యులే.. డ‌బ్బున్న వాళ్లు, న‌ల్ల‌ధ‌నికులు అలాంటి ఇబ్బందులు ఏమీ ప‌డ‌లేదు, వారి వ్య‌వ‌హారాలు చాలా సాఫీగా సాగిపోయాయ‌ని అనేక ఉదంతాలు చాటి చెబుతూ ఉన్నాయి.  అందుకు అనేక రుజువులు కూడా ల‌భించాయి. నోట్ల ర‌ద్దుతో బీదాబిక్కీ చేతిలో డ‌బ్బు చెల్ల‌క నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. క్యూల్లో నిల‌బ‌డి నానా క‌ష్టాలు పడ్డారు. 

ఇక న‌ల్ల‌ధ‌నికులు, కోటీశ్వ‌రులు మాత్రం తమ ద‌గ్గ‌ర ఉన్న బ్లాక్ మ‌నీతో ఎంచ‌క్కా ఆస్తులు కొనేశార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలే ధ్రువీక‌రిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా శశిక‌ళ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం గురించి ప్ర‌భుత్వ వ‌ర్గాలు కోర్టుకు స‌మాచారం ఇచ్చాయి. నోట్ల ర‌ద్దు జ‌రిగిన స‌మ‌యంలో శ‌శిక‌ళ భారీ ఎత్తున ఆస్తుల‌ను కొనుగోలు చేసింద‌ని వారు చెబుతున్నారు.

ఆ జాబితాను కూడా విడుద‌ల చేశారు. చెన్నై, మ‌ధురై, పెరంబూర్ ల‌లో శ‌శిక‌ళ షాపింగ్ మాల్స్ నే కొనేసింద‌ని, పాండిచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబ‌త్తూరులో పేప‌ర్ మిల్, చెన్నైలో ఒక షుగ‌ర్ మిల్, చెన్నైలోనే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ, కోయంబ‌త్తూరులో యాభై విండ్ ప‌వ‌ర్ ప్లాంట్ లు కొనేసింద‌ట  శశిక‌ళ. అందుకు సంబంధించి ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించార‌ట అధికారులు.

చేతిలో ఉండిన క్యాష్ తోనే త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి శ‌శిక‌ళ ఈ స్థాయిలో ఆస్తుల‌ను కొనేసిన‌ట్టుగా వారు చెబుతున్నారు. ఇదీ నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌ల్ల‌ధ‌నం భారీ ఎత్తున క‌లిగిన వారు చేసిన ప‌ని అని స్ప‌ష్టం అవుతోంది. న‌ల్ల‌ధ‌నికులు చేతిలోని క్యాష్ ను మార్చి ఇలా ఆస్తులు కొనుగోలు చేసుకుంటే, సామాన్యులు మాత్రం క్యూల్లో నిల‌బ‌డి, ఏటీఎంల‌లో డ‌బ్బులు లేక నానా క‌ష్టాలు ప‌డ్డారు.