ఒకవైపు రాజధాని అంశం గురించి సీఎం జగన్ ప్రకటన చేయగానే.. ఏవేవో ట్వీట్లు పెట్టిన జనసేన అధిపతి పవన్ కల్యాణ్, ఆ తర్వాత చల్లారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడే ఈ విషయంలో వెనక్కు తగ్గే సరికి పవన్ కల్యాణ్ కూడా తగ్గారు. నాలుగు రోజుల నుంచి ట్వీట్లు లేవు. ప్రకటన రాగానే గ్యాప్ లేకుండా ట్వీట్లే శారు. అయితే నాలుగు రోజుల నుంచి మాత్రం కామ్ అయిపోయింది పవన్ ట్విటర్ ఖాతా.
నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసినట్టుగా, అది తేలుస్తుందని అన్నట్టుగా చెబుతూ పవన్ కల్యాణ్ ట్వీట్లను ఆపారు. ఇక మరో పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. మూడు రాజధానుల విషయంలో మంత్రి మండలి నిర్ణయం వరకూ వేచి చూస్తారట. అవతల ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు, మరోవైపు కమిటీ నివేదికా ఇచ్చింది.. ఇలాంటి నేపథ్యంలో.. మంత్రి మండలి సమావేశం, ప్రకటనలు ఇక లాంఛనమే అని అనుకోవాలి.
అలాంటి లాంఛనమైన ప్రకటనల కోసం పవన్ కల్యాణ్ వేచి ఉండటం విడ్డూరమే! నిర్ణయం దాదాపుగా జరిగిపోయినట్టే అని స్పష్టం అవుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ ఇలా గడువు ఇచ్చారు.
ఇక పవన్ కల్యాణ్ తన పార్టీ కమిటీని అమరావతికి పంపడం కాదు.. ఆయనకు ధైర్యం ఉంటే ఆ కమిటీని కర్నూలుకు, విశాఖకు పంపాలని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అమరావతి విషయంలో అతి ప్రేమ ఒలకపోస్తున్న పవన్ కల్యాణ్.. గతంలో కర్నూలు తన మనసులో రాజధాని అని ప్రకటన చేసి అక్కడ ఓట్లు పొందే ప్రయత్నం చేశారు.
ఇప్పుడేమో… కర్నూలు ఏదో స్వల్పమైనది దక్కితేనే సహించలేకపోతూ ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర మీద కూడా పవన కల్యాణ్ ఇన్నాళ్లూ ఒలకపోసింది ఉత్తప్రేమే అని ఆయన అమరావతి అతి ప్రేమను చూస్తే అర్థం అవుతూ ఉంది. చంద్రబాబును మించి పోతున్న ద్వంద్వ వైఖరితో పవన్ కల్యాణ్ రాజకీయంగా మరింత పతనావస్థలోకి కూరుకుపోతున్నాడని స్పష్టం అవుతూ ఉంది.