బాబు కంటే ఎక్కువ భయపడుతున్న పవన్

జగన్ ఢిల్లీ టూర్ తో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది. ఢిల్లీ వెళ్లిన జగన్, ప్రధాని మోదీ దగ్గర ఏ పంచాయితీ చేసుకుని వస్తారో అని తెగ ఇదైపోతున్నారు బాబు. అమరావతి భూ కుంభకోణం,…

జగన్ ఢిల్లీ టూర్ తో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది. ఢిల్లీ వెళ్లిన జగన్, ప్రధాని మోదీ దగ్గర ఏ పంచాయితీ చేసుకుని వస్తారో అని తెగ ఇదైపోతున్నారు బాబు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్.. సీబీఐ కేసులపై క్లారిటీ వస్తుందన్న వార్తలు ఓవైపు,   వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి అవుతుందన్న ఊహాగానాలు మరోవైపు బాబుకి నిద్రలేకుండా చేస్తున్నాయి. అయితే బాబుతో పాటు నిద్రమేలుకుని ఈ వ్యవహారాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తున్న వ్యక్తి మరొకరున్నారు. అతనే పవన్ కల్యాణ్.

వైసీపీ-బీజేపీతో దోస్తీ చేస్తే.. జనసేనకు అది ఇబ్బందికరంగా మారుతుంది. కాస్తో కూస్తే వచ్చే ఎన్నికలకు టీడీపీ కంటే.. బీజేపీ-జనసేన కూటమికే ఎక్కువగా ఆశలున్నాయి. అందులోనూ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరు ప్రతిపాదిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ వెళ్లి బీజేపీతో కలిస్తే పవన్ పరిస్థితి ఏంటి? ఆయన కచ్చితంగా ఆటలో అరటిపండు అవుతారు.

నిన్న మొన్నటి దాకా.. జగన్ రెడ్డీ, జగన్ రెడ్డీ అని దీర్ఘాలు తీసిన పవన్.. రేపు ఎన్డీఏలో వైసీపీ చేరితే అన్ని సెటైర్లు వేయగలరా. పొత్తు ధర్మం ప్రకారం మోదీని మోసేసినట్టు, జగన్ ప్రభుత్వ పనితీరుని పొగడాల్సిందే కదా? జగన్ ని భుజాన మోయడం పవన్ కి ఎంతమాత్రం ఇష్టంలేదు. 

ఇలా అష్టదిగ్బంధం అయిపోయారు పవన్ కల్యాణ్. వైసీపీ, ఎన్డీఏలో చేరితే.. బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పడం మినహా మరో ఆప్షన్ లేదు. ఇవన్నీ పక్కనపెడితే.. బీజేపీ సాయంతో ముఖ్యమంత్రి అవ్వొచ్చని కలలుకంటున్న పవన్ ఆశలు అడియాశలవ్వడం ఖాయం.

అందుకే ఢిల్లీలో నేడు జరిగే పరిణామాలు చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ నే ఎక్కువగా కలవరపెడుతున్నాయని చెప్పక తప్పదు. ఒకవేళ జగన్ ఎన్డీఏలో భాగస్వామిగా మారుతున్నామంటూ ప్రకటన చేస్తే.. పవన్ ముఖచిత్రం ఏంటో!

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి