ఉన్నట్టుంది సడెన్ గా తన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ లో ఓ లవ్ సింబల్ పెట్టింది కాజల్. అంతే.. అంతకుమించి ఎలాంటి సందేశాల్లేవు. అయితే కాజల్ ఎందుకు ఆ కాదల్ సింబల్ పెట్టిందో నెటిజన్లకు మాత్రం అర్థమైపోయింది. అంతా ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎందుకో తెలియాలంటే.. మరికొన్ని గంటలు వెనక్కి వెళ్లాలి.
కాజల్ కాబోయే భర్త ఇతడే అంటూ పొద్దున్నుంచి ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇతడి పేరు గౌతమ్ కిచ్లు. ఇతడే కాజల్ కాబోయే భర్త అంటూ తెగ ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఇతడి ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ కు కాజల్ ఫాలో అవుతోంది కూడా.
ఇంతకీ ఈ గౌతమ్ ఎవరని ఆరా తీస్తే.. ముంబయిలో ఇతడొక ఇంటీరియర్ డిజైనర్. దీంతో పాటు మరో 2-3 వ్యాపారాలు కూడా ఉన్నాయి. కాజల్ కుటుంబంతో గౌతమ్ ఫ్యామిలీకి సంబంధాలు కూడా ఉన్నాయి. అలా ఓ సందర్భంలో వీళ్లిద్దరూ కలుసుకున్నారట. అప్పట్నుంచి డేటింగ్ లో ఉన్నారంటూ ముంబయికి చెందిన ఓ టాబ్లాయిడ్ కథనం.
ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తూ కొద్దిసేపటి కిందట లవ్ సింబల్ పోస్ట్ చేసింది కాజల్. చూస్తుంటే.. మరికొన్ని గంటల్లో ఆమె తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెడుతుందేమో.
కాజల్ పెళ్లిపై పుకార్లు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఓ షేప్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. 35 ఏళ్ల కాజల్ ఇప్పటికీ సౌత్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆచార్య, ఇండియన్-2 సినిమాలున్నాయి.