బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై శివసేన పార్టీ విసిరిన పంచ్ అదిరింది. నిజానికి చాలా మంది మనసుల్లో ఉన్న ప్రశ్ననే కంగనాకు శివసేన సూటిగా విసిరింది. ఉత్తరప్రదేశ్‌లో యువతిపై సామూహిక హత్యాచారం నేపథ్యంలో ఉలుకూ పలుకూ లేకుండా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న కంగనా రనౌత్ ఏ కలుగులో దాక్కున్నారని శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది.
బాలీవుడ్ హీరో సుశాంత్‌ది ఆత్మహత్యేనని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్ధారిస్తూ మెడికల్ రిపోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనకు ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేసేందుకు ఓ ఆయుధం చిక్కినట్టైంది.
శివసేన రాజకీయ విమర్శలకు పదును పెట్టింది. సుశాంత్ కేసులో అంతిమంగా సత్యం వెలుగులోకి వచ్చిందని, ఈ ఎపిసోడ్‌లో మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర జరిగిందని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో దుమ్మెత్తి పోసింది.
సుశాంత్ మృతిపై ఎయిమ్స్ నివేదికను మూఢ భక్తులు వ్యతిరేకిస్తారా అని సూటిగా ప్రశ్నించింది. సుశాంత్ కేసుపై కుక్కల్లా మొరిగి, ముంబై పోలీసులను అనుమానించిన రాజకీయ నేతలు, వార్తా చానళ్లు ఇప్పుడు తమ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది.
ఇదే సందర్భంలో ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్లో దళిత యువతిపై జరిగిన సామూహిక హత్యాచారంపై ఎందుకు ప్రశ్నించడం లేదని శివసేన గట్టిగా నిలదీసింది. ఆ దుర్ఘటనపై నోరు మెదపని వాళ్లు మహారాష్ట్ర నిబద్ధతను ప్రశ్నించలేరని తేల్చి చెప్పింది.
ఈ సందర్భంగా బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ను శివసేన గట్టిగా నిలదీసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసుపై నానా రాద్ధాంతం చేయడమే కాకుండా ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన బాలీవుడ్ నటి ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని కంగనా రనౌత్‌ను ఉద్దేశించి శివసేన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
యూపీలోని హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచారంపై కంగనా కనీసం రెండు కన్నీటి చుక్కలు కూడా రాల్చలేదని శివసేన ఎద్దేవా చేసింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే కంగనా రనౌత్ నోరు మెదపలేదని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు శివసేన కూడా మరింత బలంగా అవే ప్రశ్నలను కంగనాపై సంధిస్తోంది. శివసేన విమర్శలపై కంగనా స్పందన ఏంటో?