ఒమిక్రాన్ టెర్రర్ తెలంగాణలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసును గుర్తించగా.. ఇప్పుడు హైదరాబాద్ లో ఏకంగా 2 ఒమిక్రాన్ కేసులున్నట్టు అధికారులు ప్రకటించారు. వీళ్లను వెంటనే ఐసొలేషన్ కు తరలించారు. వీళ్లతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు అధికారులు.
ఈనెల 12న కెన్యా నుంచి ఓ మహిళ హైదరాబాద్ వచ్చింది. ఆమె శాంపిల్స్ తీసుకొని జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా.. ఒమిక్రాన్ నిర్థారణ అయింది. వెంటనే ఆమెను టిమ్స్ కు తరలించి ఐసొలేషన్ లో ఉంచారు. ఇక సోమాలియా నుంచి మరో వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. అతడికి కూడా జెనోమ్ సీక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ అని తేలింది.
మరోవైపు ఇంకో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారించినప్పటికీ, అతడికి తెలంగాణకు సంబంధం లేదని హెల్త్ డైరక్టర్ ప్రకటించారు. ఓ ఏడేళ్ల బాలుడు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడని, అతడు ఎయిర్ పోర్ట్ లోనే ఉండి, అట్నుంచి అటు కోల్ కతా వెళ్లాడని, ఆ బాలుడి నుంచి తీసుకున్న శాంపిల్ లో ఒమిక్రాన్ తేలినట్టు తెలిపారు. ఈ వివరాల్ని పశ్చిమ బెంగాల్ అధికారులకు అందించామన్నారు.
ప్రస్తుతానికైతే హెల్త్ డైరక్టర్ చెప్పినదాని ప్రకారం, తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఈ రెండు మాత్రమే. కాకపోతే వీళ్లతో ఎంతమంది కాంటాక్ట్ లోకి వచ్చారు, వీళ్లు ఏఏ ప్రదేశాల్లో తిరిగారు అనే అంశంపై మిగతా కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
మరోవైపు ఒమిక్రాన్ కు సంబంధించి తెలంగాణలో వస్తున్న పుకార్లను ఖండించారు హెల్త్ డైరక్టర్. ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒమిక్రాన్ పేషెంట్ తప్పించుకున్నాడనే వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ పేషెంట్లలో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని.. ప్రజలంతా భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు వేసుకోవాలని సూచించారు.