నారా లోకేష్ తన చుట్టూ తాను గిరి గీసుకున్నారు. మంగళ'గిరి'కే పరిమితం అయ్యారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నా ఆయనిప్పుడు పట్టించుకోవడం లేదు. మంగళ'గిరి'లో మాత్రం యమా దూకుడుగా వెళ్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అక్కడ గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. భావి నాయకుడిగా టీడీపీ వందిమాగధులు కీర్తిస్తున్న లోకేష్ ఇలా లోకల్ లీడర్ గా మారిపోవడం వెననక పెద్ద కథే ఉంది.
ఇటీవల లోకేష్ ని చాలా సందర్భాల్లో వైసీపీ వర్గాలు ఆటాడేసుకున్నాయి. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకని రెచ్చగొట్టాయి. దీంతో చినబాబుకి తిక్కరేగింది.
చిన్న పిల్లలు ఉడుక్కున్నట్టు ముందు మంగళగిరి సంగతి తేలుద్దామంటూ బయలుదేరారు. అందులోనూ పార్టీ కార్యాలయంపై దాడి జరగడం, అమరావతి వివాదం ముదరడంతో మంగళగిరి తనకు మంచి ప్లేస్ అని డిసైడ్ అయ్యారు.
రెండు వారాలుగా జనంలో..
నారా లోకేష్ రెండు వారాలుగా మంగళగిరిలో జనంతో మమేకం అవుతున్నారు. రోడ్ సైడ్ వ్యాపారులకు తోపుడు బండ్లు పంచిపెట్టారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు.
రోడ్ షోలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నారు. ఇప్పటినుంచి ఫౌండేషన్ వేస్తే తప్ప.. వచ్చే ఎన్నికలనాటికి మంగళగిరిలో ఓట్లు పడవని భావించిన లోకేష్.. రెండున్నరేళ్ల ముందుగానే రోడ్లపైకి వచ్చారు. కాదు కాదు, ఆయన్ను రోడ్డుపైకి లాక్కొచ్చారు టీడీపీ నాయకులు.
జాతి నాయకుడు, జాతీయ హోదా..
లోకేష్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనే హోదా ఉంది. కానీ ఆయన కనీసం రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అంతకంటే కాదు, కేవలం జాతి నాయకుడు మాత్రమే.
రాష్ట్రంలో పార్టీని పటిష్ట పరిచేందుకు చంద్రబాబే ఇంకా కష్టపడుతున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు పెడుతూ హడావిడి చేస్తున్నారు. కనీసం భావి నాయకుడు అని అనుకుంటున్న లోకేష్ కి మాత్రం ఈ సమీక్షల్లో ఎంట్రీ లేదు.
అంటే ఒకరకంగా లోకేష్ ముద్ర పార్టీపై పడకుండా తన పని తాను చేసుకుంటున్నారు బాబు. అటు చినబాబు కూడా అవన్నీ మనకెందుకులే మంగళగిరిలో గెలిస్తే అదే పదివేలు అంటూ గిరిగీసుకుని బతికేస్తున్నారు.
ప్రస్తుతానికి చంద్రబాబుకి, ఇతర నాయకులకి కూడా అదే కావాల్సింది. అందుకే లోకేష్ కి మంగళగిరి అప్పగించేసి చేతులు దులుపుకున్నారు.