తిరుపతిలో ఈ నెల 17న నిర్వహించతలపెట్టిన రెండు బహిరంగ సభలకు పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆ వ్యవహారం హైకోర్టుకు చేరడం ఆసక్తి పరిణామం. రెండు వేర్వేరు ప్రాంతీయ సంస్థలు తమకు సభలు నిర్వహించుకోడానికి అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ వ్యాజ్యాలపై నేడు విచారించనుంది. హైకోర్టు నిర్ణయం ఎలా వుంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
అమరావతిలోనే రాజధాని ఉండాలనే డిమాండ్‌పై న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో 44 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.
ఇదే సందర్భంలో రాయలసీమ హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాయలసీమ మేధావుల ఫోరం హైకోర్టును ఆశ్రయిం చింది.
తాము తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఫోరం నేతలు మాకిరెడ్డి పురుషోత్వంరెడ్డి, డాక్టర్ డి.మస్తానమ్మ, ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను స్వీకరించిన హైకోర్టు ఇవాళ తన విచారణ చేపట్టనున్నట్టు సమాచారం.
సభల నిర్వహణకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు వుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంపై సభల నిర్వహణ ఆధారపడింది. అందుకే న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.