అమరావతి రాజధాని రైతుల ముసుగులో తిరుపతిలో కొందరి చేష్టలు రాయలసీమ వాసుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ఇదే సందర్భంలో రాయలసీమకు గుండెకాయ లాంటి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఆ ప్రాంత వాసులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, వారి కండకావరాన్ని తెలియజేస్తోంది.
భిన్నమైన అభిప్రాయాల్ని పరస్పరం గౌరవించు కోవడం ప్రజాస్వామిక లక్షణం. కానీ తమ నినాదమే విధానంగా ఉండాలని, అదే శిలాశాసనం కావాలని వికృత చర్యలకు పాల్పడడం ఏంటని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో 44 రోజులు పాటు పాదయాత్ర సాగించారు. ఈ యాత్ర నిన్న తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు చేరికతో ముగిసింది. తిరుపతికి చేరిన పాదయాత్రికులకు అక్కడి ప్రజలు వినూత్నంగా స్వాగతం పలికారు.
‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’ అంటూ తిరుపతి ప్రజలు నగరమంతా ఫ్లెక్సీలు పెట్టి శాంతియుతంగా, మంచి మనసుతో తమ ప్రాంతానికి స్వాగతం పలికారు. 44 రోజుల పాటు 400 కిలోమీటర్లకు పైబడి దారి పొడవునా తమ డిమాండ్‌ను, ఆకాంక్షలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకురావడాన్ని అందరూ చూశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ భావాలను ప్రకటించుకునే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఫలాలను పుష్కలంగా ఆస్వాదిస్తూ తిరుపతికి చేరిన పాదయాత్రికులకు, ఇతర ప్రాంతాల మనోభావాలను గౌరవించాలనే కనీస సంస్కారం, స్పృహ కొరవడడం విమర్శలకు దారి తీసింది.
అది కూడా ప్రశాంతతకు, ఆధ్మాత్మిక చింతనకు కేంద్రమైన తిరుపతిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉంది. జనసేన, టీడీపీ కలిసి తిరుపతిలో రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం వెనుక కుట్ర ఉందనే అభిప్రాయాలున్నాయి.
రాజకీయంగా రాయలసీమలో ఈ రెండు పార్టీలకు ప్రజాదరణ లేకపోవడంతో రెచ్చిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మీకు స్వాగతం అంటూ’ తిరుపతి ప్రజలు సహృదయతతో ఆహ్వానం పలకగా, దాన్ని స్వీకరించే సంస్కార కూడా లేకపోవడం దేనికి సంకేతం? ఇది అహంకారమా? లేక డబ్బుందనే లెక్కలేని తనమా? ఏం చేసినా తమకేం కాదనే ధీమానా?
తిరుపతి ప్రజలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి, కాళ్లతో తన్నడం అంటే… అది తమ గుండెపై తన్నడంగానే రాయలసీమ సమాజం భావిస్తోంది. ఈ చర్యలపై ఆ ప్రాంతం మనస్తాపం చెందింది. ఆవేదన, ఆగ్రహంతో రగిలిపోతూ కూడా అతిథులతో మర్యాదగా వ్యవహరించాలనే ఉద్దేశంతో సంయమనాన్ని, సంస్కారాన్ని పాటించింది.
ఒకవేళ పాదయాత్రను అడ్డుకోవాలంటే తిరుపతి ప్రజానీకానికి పెద్ద పనేమీ కాదు. అలాంటి నీచమైన, క్రూరమైన సంస్కారం రాయలసీమది కాదు. ప్రాంతాలు వేరైనా మనమంతా మనుషులుగా ఒక్కటే అనే భావన తిరుపతి వాసుల్లో కనిపించింది.
తన అడ్డాకు వచ్చి, రెచ్చగొడుతున్నా నవ్వుతూ స్వాగతించిన గొప్ప హృదయం రాయలసీమ వాసులది. కానీ రాయలసీమ వాసులు తమకు కనీసం హైకోర్టు ఇవ్వాలని కోరడమే తప్పైనట్టు, ఫ్లెక్సీలను చించేయడం వారి సంస్కారాన్ని తెలియజేస్తోంది. పాదయాత్ర ముగింపు రోజు కొందరి చేష్టలు, అమరావతి పరిరక్షణ సమితికి మచ్చగా మిగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.