పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంతవరకు ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు.
తమిళనాడైనా, ఉత్తరభారతమైనా కూడా టాప్ సినిమా స్టార్లు రాజకీయాల్లోకి దిగే సరికి జూనియర్ ఆర్టిస్టుల్లా మిగిలిపోతున్నారు. దీనికి కారణం ఒక్కటే. వారికి సరైన రాజకీయ అవగాహన లేకపోవడం, పోరాట పటిమ కొరవడడం, చిత్త శుద్ధి లోపించడం, పూర్తి సమయాన్ని కేటాయించలేకపోవడం, కేవలం తమ సినిమా ఇమేజునే నమ్ముకుని పనిచేయడం, ఫ్యాన్స్ కేకలు విని అది అశేష ప్రజానీకం యొక్క ప్రతిధ్వనిగా అపోహ పడడం..ఇలా అనేక కారణాలున్నాయి.
కమలహాసన్ ఫెయిల్ అయినా, ప్రకాష్ రాజ్ భంగపడ్డా అన్నిటికీ కారణం ఇదే.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో బాగా చిన్నబోతున్నారు.
ఎన్నో అంచనాలతో జనసేన పెట్టి ఇంతవరకు తాను కూడా ఎమ్మెల్యేగా బోణీ కొట్టకుండా ఉన్నారు. పైగా పార్టీ అధ్యక్షుడిని జనం ఓడించడం ఇదే ప్రప్రధమం అని ఆయనగారి ఫ్యాన్స్ స్పీచులివడం, ఫ్యాన్స్ క్రమశిక్షణలో లేకపోవడం వల్లే తాను ఓడిపోయానని పవన్ వేదిక మీదనుంచి చెప్పడం అంతా హాస్యాస్పదంగాను, చిరాకు గాను ఉంది.
ఒక సినిమా నటుడి కోసం ఫ్యాన్స్ ఓవర్ గా హడావిడి చేసి అదొక న్యూసెన్స్ గా పరిణమించినప్పుడు మిగిలిన జనానికి విసుగొస్తుంది. పైగా ఆ ఫ్యాన్స్ సమాజానికి ఏం పనికొస్తారో అర్థం కానప్పుడు మరింత చిరాకొస్తుంది.
నిజానికి అంతమంది జనసైనికులు ప్రజాసంక్షేమం కోసం పాటు బడుతూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాలిపోయి ఇంటి పెద్దకొడుకు లాగ చూసుకుంటూ, ఏ మహిళకి ఏ అవసరం వచ్చినా వీరమహిళలనబడే జనసేన మహిళాసభ్యులు సేవ చేస్తూ ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ దాదాపు దేవుడయ్యుండేవాడు.
ప్రభుత్వం నియమించిన విలేజ్ వాలంటీర్స్ కి పోటీగా జనసైనికులు నిలబడుంటే ఆ కథే వేరుగా ఉండేది.
ఆయనకి గానీ, ఆయన ఫ్యాన్స్ కి కానీ ఇంత దూరదృష్టి, చిత్త శుద్ధి, సేవాబుద్ధి లేదు.
ఎంతసేపూ నాయకుడి కళ్లల్లో పడే స్పీచులెలా ఇవ్వాలి అని వీళ్ళకి, వీళ్ల పిచ్చతనాన్ని ఎలా వాడుకోవాలి అని ఆయనకి తప్ప ఇంకొకటి లేదు.
ఇప్పుడు తెదేపా అసలు విషయం గ్రహించినట్టుంది. పవన్ కల్యాణ్ తో రాజకీయ కాపురం ఒక బ్యాగేజే తప్ప ఉపయోగం లేదని తెలుసుకున్నట్టుంది. అందుకే ఆయన్ని దూరం పెట్టమని రాజకీయాల్లో ఓనమాల దశలో ఉన్న లోకేషుకి కూడా అర్థమైపోయిందని వినికిడి.
ఇప్పుడు నిజంగా పవన్ ని తెదేపా దూరం పెడితే ఇక ఆయనగారి రాజకీయ జీవితం సమాప్తమైనట్టేనేమో. ఎందుకంటే సినిమా అనగానే నిర్మాత మీద, రాజకీయమనగానే తెదేపా మీదా జారిపడి నడుం వాల్చడం పవన్ కి అలవాటైపోయింది. స్వతఃసిద్ధంగా నిలబడి ఒంటరి పోరాటం చేసేటంత తీరక, ఓపిక ఆయనకి లేవు. ఆర్థిక మూలాలకోసం సినిమాలు చేసుకోవాలి కదా.
చివరిగా చెప్పేదేంటంటే అటు బీజేపీకి గానీ, ఇటు తెదేపాకి కానీ పవన్ ని దూరం పెట్టేయాలన్న నిర్ణయం బలపడితే ఇక జనసేన కాలగర్భంలో కలిసేలా ఉంది.
అలా కాకుండా ఉండాలంటే జనసేనాని, జనసైనికులు అందరూ కూడా ప్రజల మనసుల్ని ఎలా గెలుచుకోవాలో చూడాలి. అప్పుడే భవిష్యత్తు. దానికి సమయం, శ్రమ అన్నీ పెట్టాలి.
– శ్రీనివాసమూర్తి