అధికారం లేకున్నా… బాబు ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్‌!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసు విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ నేత‌లు ఏడ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌ద్వారా చంద్ర‌బాబు అధికారంలో లేక‌పోయిన‌ప్ప‌టికీ అత్యంత శ‌క్తిమంతుడని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల…

మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసు విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ నేత‌లు ఏడ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌ద్వారా చంద్ర‌బాబు అధికారంలో లేక‌పోయిన‌ప్ప‌టికీ అత్యంత శ‌క్తిమంతుడని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప‌దేప‌దే లోకానికి చాటి చెబుతున్నారు. వివేకా హ‌త్య‌పై సీబీఐ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇదే సంద‌ర్భంలో వైసీపీ నేత‌లు పొంత‌న‌లేని కౌంట‌ర్ల‌తో బేల‌త‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట‌లు వింటుంటే ఆయ‌న‌పై జాలిప‌డాలో, కోప్ప‌డాలో కూడా తెలియ‌ని స్థితి. సీబీఐ అనేది కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌. కేంద్ర ప్ర‌భుత్వంతో ఏపీ అధికార పార్టీకి అన్యోన్య సంబంధాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ‌లో కేసీఆర్ టీమ్ మాదిరిగా బీజేపీతో వైసీపీ ఫైట్ చేయ‌డం లేదు. ఏపీకి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ స‌ర్కార్ ఎంతో అన్యాయం చేస్తున్నా… అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలేవీ నోరు మెద‌ప‌ని దుస్థితి.

పైపెచ్చు, కేంద్రం తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యానికి, తెచ్చే ప్ర‌తి చ‌ట్టానికి అడ‌గ‌కుండానే మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీలుగా వైసీపీ, టీడీపీలు గుర్తింపు పొందాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే దేశంలో వెన్నెముక లేని పార్టీలు ఏవైనా ఉన్నాయా? అనే ప్ర‌శ్న‌కు… ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల పేర్ల‌ను స‌మాధానంగా చెప్పొచ్చు. అంతగా బీజేపీకి టీడీపీ, వైసీపీ సాగిల‌ప‌డ్డాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకునేలా సీబీఐ కుట్ర‌ప‌న్నుతుంటే … వైసీపీ ప్ర‌శ్నించాల్సింది ఎవ‌రిని?  ప్ర‌శ్నిస్తున్న‌దెవ‌రిని? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది. ఇక్క‌డ కూడా చంద్ర‌బాబునాయుడినే విమ‌ర్శించ‌డానికి వైసీపీ నేత‌లు తెగ‌బ‌డ్డారంటే వారి నిస్స‌హాయ స్థితిని, కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేని అధైర్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే. స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతూ… వివేకా హ‌త్య కేసులో విచార‌ణ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి పేర్ల‌ను కుట్ర‌పూరితంగా  ప్ర‌స్తావిస్తున్నార‌న్నారు. ఈ కుట్ర‌ల వెనుక మాస్ట‌ర్ మైండ్ చంద్ర‌బాబే అని ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీలో ఉన్న త‌న మ‌నుషుల ద్వారా వ్య‌వ‌స్థ‌ల్ని చంద్ర‌బాబు మేనేజ్ చేస్తున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు. బాబు కుట్ర‌ల‌కు అనుగుణంగా సీబీఐ డ్రామా ఆడుతున్న‌ట్టుగా స‌జ్జ‌ల ఆరోపించారు. కేసును జ‌గ‌న్ వైపు తిప్ప‌డం ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌జ్జ‌ల చెప్పారు. క‌థ‌, స్క్రీన్ ప్లే అంతా చంద్ర‌బాబుదే అని స‌జ్జ‌ల చెప్ప‌డం గ‌మ‌నార్హం. కిందిస్థాయి అధికారులు చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు వింటున్నార‌ని స‌జ్జ‌ల ఆరోపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  చంద్రబాబు వేసిన విత్తనాలు మొలకెత్తి అన్ని వ్యవస్థల్లోనూ బలంగా నాటుకుపోయాయ‌న్నారు.

స‌జ్జ‌ల చెప్పిన‌వ‌న్నీ నిజాలే అనుకుందాం. మ‌రి అధికారంలో ఉన్న పార్టీగా, కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తి విష‌యంలోనూ మ‌ద్ద‌తు ఇస్తున్న పార్టీగా… అటువైపు నుంచి ఏం ల‌బ్ధిపొందుతున్నారో అర్థం కావ‌డం లేదు. ఇటు రాష్ట్రానికి, అటు వ్య‌క్తిగ‌తంగా కూడా న‌ష్టం జ‌రుగుతున్నా, కాపాడుకోలేని స్థితిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఉన్నార‌నే సంకేతాలు స‌జ్జ‌ల మాట‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. ఏపీ హ‌క్కుల్ని కాపాడుకునే అంశాన్ని కాసేపు పక్క‌న పెడ‌దాం. కనీసం వ్యక్తిగ‌తంగా త‌న‌ను తాను సంర‌క్షించుకునే స్థితిలో కూడా జ‌గ‌న్ లేరా?  

గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన చంద్ర‌బాబు…. ఇప్ప‌టికీ కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్నారా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌తో యుద్ధం చేస్తున్నాన‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతుంటారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే యుద్ధాన్ని ఎదుర్కోవ‌డ‌మా? స‌జ్జ‌ల చెబుతున్న మాట‌ల ప్ర‌కారం ఇప్ప‌టికీ చంద్ర‌బాబు అత్యంత ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్‌. ఆయ‌న దెబ్బ‌కు వివేకా కేసులో వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, వైసీపీ గిల‌గిల‌లాడుతున్న‌ట్టుగా తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి.