కనీసం జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడనంతగా ఎందుకాయనపై లోకేశ్‌కు కోపం అనే చర్చ జరుగుతోంది. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసి తిరిగి వస్తూ, ప్రమాదానికి గురై, మృత్యువు అంచుల వరకూ వెళ్లొచ్చిన తమ అభిమాన హీరో జూ.ఎన్టీఆర్‌పై లోకేశ్ కక్ష పెంచుకోవడం న్యాయమా? అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ పేరిట తెలుగు యువత లోకేశ్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా యువత సంధించిన కొన్ని ప్రశ్నలకు లోకేశ్ తనకు తోచిన సమాధానాలు చెప్పారు. జూ.ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. లోకేశ్ స్పందిస్తూ…. పాము చావకుండా, కట్టె విరగకుండా అనే రీతిలో సమాధానం ఇచ్చారు. జనసేన పేరుతో పవన్‌కల్యాణ్ తనకంటూ సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల్లో లోకేశ్ కంటే పవనే సీనియర్. కాబట్టి పవన్‌ను లోకేశ్ స్వాగతించడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వద్దాం. లోకేశ్ కంటే ఎంతో ముందే టీడీపీ కోసం ఆయన పని చేశారు. అయితే లోకేశ్ సమాధానం చెప్పే సందర్భంలో బిల్డప్ ప్రదర్శించారనే విమర్శ వ్యక్తమైంది. లోకేశ్ ఏమన్నారంటే… నూటికి నూరు శాతం ఆహ్వానిస్తానన్నారు. ఎవరైతే ఏపీలో మార్పు ఆశిస్తున్నారో, ఏపీ అగ్రస్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నారో వారంతా రాజకీయాల్లోకి రావాలని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్‌ను 2014లో ఒకసారి కలిసినట్టు చెప్పారు. ఏపీలో మంచి ప్రభుత్వం రావాలి, మార్పు రావాలి, ముందుకు పోవాలనే తాపత్రయం ఆయనలో చూశానన్నారు. అలాంటి వారు రావాలన్నారు. సమాజంలో మార్పు రావాలన్నా, మంచి పాలన తేవాలన్నా సినిమా స్టార్‌గా, పారిశ్రామికవేత్తగా ఉన్నవారు చేయగలుగుతారని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర భవిత కోసం పనిచేసే వారంతా రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ చెప్పుకొచ్చారు.
అంతే తప్ప, ప్రత్యేకంగా జూ.ఎన్టీఆర్ గురించి లోకేశ్ మాట్లాడకపోవడాన్ని తెలుగు యువత, అలాగే ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమాధానంతో జూ.ఎన్టీఆర్ రాకను మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదనే సంగతి బయటపడిందని అంటున్నారు.
జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, తన వారసత్వానికి థ్రెట్ అని లోకేశ్ భయపడుతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ భయమే జూ.ఎన్టీఆర్‌పై లోకేశ్‌లో అక్కసు పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.