జంట నగరాలు అంటే అంతా హైదరాబాద్ సికింద్రాబాద్ నే తలచుకుంటారు. రెండూ దేనికదే అన్నట్లుగా అభివృద్ధి సాధిస్తూ వచ్చాయి. కోటి జనాభాతో ఒక రాష్ట్రం మాదిరిగా ఈ రోజున హైదరాబాద్ ఉంది. దాని వెనక అభివృద్ధి ఎంతో పాత్ర పోషించింది. అదే రెండు నగరాల మధ్య దూరాన్ని తగ్గించింది.
ఏపీలో అలాంటి జంట నగరాలను కొన్ని తయారు చేయవచ్చు. ఇపుడు విశాఖతో పాటు విజయనగరాన్ని కలుపుకుని జంట నగరాలుగా అభివృద్ధి చేసే ఆలోచనను వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. విజయనగరం జిల్లాలో భోగాపురం ఈ రెండింటి మధ్యన అనుసంధానం కానుంది.
ఈ రెండు ప్రాంతాల మధ్య యాభై కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. ఈ మధ్యన ఉన్న దూరాన్ని చెరిపేస్తూ ఎక్కడికక్కడ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధికి రాచబాట వేయాలన్నది వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.
మార్చి నెల 3, 4 తేదీలలో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్ ఇన్వెస్టెర్స్ సమ్మిట్ లో విశాఖ విజయనగరం ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని చాటి చెబుతామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ అంటున్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోందని, విశాఖ లో ఎయిర్, సీ, పోర్టు రైల్ కనెక్టివిటీ ఉందని, ఇవన్నీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.
ఈ రోజున ఏపీలో అతిపెద్ద నగరంగా విశాఖ ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలను కలిగి ఉందని వైసీపీ మంత్రులు నేతలు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవించనున్నాయని వారు అంటున్నారు. అలాగే విశాఖను జర్మనీలోని హాంబర్గ్ నగరం మాదిరిగా ఆదాయన్ని ఇచ్చే తెచ్చే మహా నగరంగా అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అదే నిజమైతే ఏపీ ప్రగతిని ఎవరూ ఆపలేరు. ఎవరూ అసలు ఊహించలేరు కూడా.