వీళ్లు నేతలా.. థూ వీళ్ల బతుకు చెడ!

వాళ్లు కూడా ప్రజాప్రతినిధులే. ఒక్కొక్కరు కనీసం లక్ష మంది మనబోటి సామాన్య ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు. భారీలో సగం మంది సామాన్యుడి పార్టీ కి చెందినవారు.. మిగిలినవారు నైతిక విలువలకు తాము చిరునామా…

వాళ్లు కూడా ప్రజాప్రతినిధులే. ఒక్కొక్కరు కనీసం లక్ష మంది మనబోటి సామాన్య ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు. భారీలో సగం మంది సామాన్యుడి పార్టీ కి చెందినవారు.. మిగిలినవారు నైతిక విలువలకు తాము చిరునామా అని చెప్పుకునే పార్టీకి ప్రతినిధులు! అయితే వీరందరూ కలిసి సిగ్గుమాలిన పనికి దిగజారారు. వీరికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు సిగ్గుతో తలదించుకునే లాగా, ‘థూ.. వీళ్ల బతుకు చెడ’  అని ఈసడించుకునేలాగా వారి ప్రవర్తన కనిపించింది.  

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చీకటి అధ్యాయాలు గతంలో లేవు అని అనలేము గాని.. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సందర్భంగా జరిగిన రగడ అత్యంత ఘోరంగా ఉంది.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపిల మధ్య బలాబలాల  ప్రదర్శనకు వేదికగా మారింది. స్పష్టమైన మెజారిటీ లేకపోయినా భారతీయ జనతా పార్టీకి కూడా ఓ మోస్తరు సభ్యుల బలము ఉండడంతో.. ఇక్కడ నానా రచ్చా అవుతోంది. మేయర్ ఎన్నిక అనే ప్రహసనమే వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఆప్ చేతికి దక్కిన సంగతి అందరికీ తెలిసిందే.   

ఇప్పుడు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించగా.. సమావేశం హాలు కాస్త రణరంగంగా మారిపోయింది. ఒక ఓటు చెల్లదని మేయర్ ప్రకటించడంతో ఆగ్రహించిన బిజెపి సభ్యులు దురుసుగా వ్యవహరించడం వల్ల మొత్తం సభ అదుపుతప్పింది.

వీళ్లు గౌరవ కౌన్సిలర్లా.. వీధి గుండాలా.. కిరాయి ఆకతాయి రౌడీ మూకలా అని అనిపించేలాగా ఢిల్లీ ఎపిసోడ్ జరగడం గమనార్హం. డాబుసరిగా ఖరీదైన ఖద్దరు దుస్తులు, వాటి మీద రాజకీయ నాయకుడి కోట్లు  ధరించిన గుండాలు.. అక్కడ స్వైర విహారం చేస్తున్నారా అని చూసిన వారికి అనిపించింది. 

ఆమ్ ఆద్మీ పార్టీ తాను సామాన్యుల పార్టీ అని చెప్పుకుంటుంది. రాజకీయాలలో సరికొత్త విలువల ప్రతిష్టాపనకే తమ పార్టీ పుట్టినట్లుగా నిర్వచించుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మాటలకు కొదవ ఉండదు. తమది నైతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపమని చాటుకుంటూ ఉంటుంది. కానీ ఈ రెండు పార్టీల ప్రజాప్రతినిధులు కౌన్సిల్ సమావేశంలో అత్యంత హేయమైన రీతిలో వ్యవహరించారు. వీరిని గెలిపించిన ప్రజలు సిగ్గుపడే పరిస్థితి  కల్పించారు. 

రాజకీయాల్లోకి వచ్చే నాయకులు అక్రమార్జనులకు పాల్పడి అడ్డగోలుగా కుబేరులు అయిపోయే వాతావరణానికి  ప్రజలు అలవాటు పడిపోయారు. కానీ ఇలా తాము గెలిపించిన నాయకులు బజారు రౌడీల్లా ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వాస్తవాన్ని అందరు నాయకులు గుర్తిస్తే మంచిది.