చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ లో ఒక్కటొక్కటిగా అమలు కాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం అని అర్థమైన తర్వాత.. ఆ పార్టీలో ఉన్న తన ఏజంట్లను, ప్లాంటర్లను, కోవర్టులను నెమ్మదిగా తన పార్టీలోకే లాక్కునే ప్రయత్నాలకు చంద్రబాబునాయుడు తెరతీసినట్లుగా కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వచ్చిన తర్వాత.. విష్ణుకుమార్ రాజు కూడా వస్తారనే ప్రచారం సాగింది. అలాగే మరో వికెట్ కూడా బిజెపి నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించబోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
చంద్రబాబునాయుడు పాలనలో బిజెపి తరఫున మంత్రిగా ఛాన్సు దక్కించుకున్న కామినేని శ్రీనివాస్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం బిజెపిలోనే నామ్ కేవాస్తే ఉన్నారు గానీ.. పార్టీ కార్యకలాపాల పట్ల క్రియాశీలంగా లేరు. అలాగని క్రియాశీల రాజకీయాల పట్ల విముఖంగా కూడా లేరు. ఇటీవల తన జన్మదినాన్ని హైదరాబాదులో.. చాలా భారీ ఎత్తున రాజకీయ సినీ సెలబ్రిటీలు అందరినీ ఆహ్వానించి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. సదరు కామినేని శ్రీనివాస్ కూడా త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.
బిజెపి నుంచి ఎందరు నాయకులు తెలుగుదేశంలోకి వచ్చినా, వారందరికీ చంద్రబాబునాయుడు తయారు చేసిన స్క్రిప్టు ఒక్కటే. ప్రధాని మోడీని భయంకరంగా కీర్తించాలి, బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని తూలనాడాలి.. పార్టీని వీడిపోతున్నాం అని ప్రకటించాలి. రాష్ట్ర నాయకత్వం కారణంగా.. రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు లేదు అనే మాట అనిపించాలి.. అదే స్క్రిప్టు. తద్వారా.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోడానికి ప్రధాన అడ్డంకిగా మారిన సోము వీర్రాజుకు ఆ పార్టీలో భవిష్యత్తు లేకుండా చేయాలనేది కూడా చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
కామినేని శ్రీనివాస్ విషయంలో చంద్రవ్యూహం ఇవాళ్టిది కాదు. 2014 ఎన్నికలకు పూర్వమే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న కామినేని శ్రీనివాస్, తనకు ఆప్త మిత్రుడైన పవన్ కల్యాణ్ ద్వారా చంద్రబాబును సంప్రదించారు. తెలుగుదేశంలో చేరాలని ఆయన అనుకున్నారు. అయితే చంద్రబాబు తన సహజమైన తెలివితేటలతో.. తన పార్టీలోకి వస్తే మంత్రి పదవులు కట్టబెట్టడంలో కులాల సమీకరణలు అడ్డు వస్తాయనే ముందచూపుతో.. ఆయనకు సలహా ఇచ్చి బిజెపిలో చేర్పించారు.
మనసంతా తెలుగుదేశమే ఉన్న కామినేని శ్రీనివాస్ ఆ రకంగా బాబు సలహాతో బిజెపిలో చేరడం, ఆయన కోరుకుంటున్న సీటును బిజెపికి కేటాయించడానికి చంద్రబాబు ఓకే చెప్పడం, ఆయన ఎమ్మెల్యే కావడం జరిగాయి. ఎటూ ఆ పార్టీలో తన ఏజెంటే గనుక.. వెంటనే మంత్రి పదవిని కూడా చంద్రబాబు కట్టబెట్టారు.
ఇప్పుడిక బిజెపితో మైత్రి కుదిరే పరిస్థితి లేదు గనుక.. కామినేని శ్రీనివాస్ ముసుగు తొలగించేసి, నేరుగా తెలుగుదేశంలోనే చేరబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.