యువగళం పాదయాత్ర తిరుపతిలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కొన్ని చోట్ల అభ్యర్థులను లోకేశ్ ప్రకటిస్తున్నారు. నగరి, శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థులుగా గాలి భానుప్రకాశ్, బొజ్జల సుధీర్‌రెడ్డి పేర్లను సంబంధిత నియోజకవర్గాల ప్రజలకు లోకేశ్ పరిచయం చేశారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో లోకేశ్ ప్రసంగిస్తూ… వాళ్లిద్దరిని గెలిపించాలని పిలుపునివ్వడం గురించి తెలిసిందే.
తన పేరును కూడా లోకేశ్ అదే విధంగా ప్రకటిస్తారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ సుగుణమ్మ ఆశించారు. అయితే ఆమె ఆశలపై లోకేశ్ నీళ్లు చల్లారు. సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా ఉండేందుకే కనీసం ఆయన తిరుపతిలో బహిరంగ సభ కూడా నిర్వహించకపోవడాన్ని గమనించొచ్చు. అంతేకాదు, సుగుణమ్మకు టికెట్ ఇచ్చేది లేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ పరిధిలో లోకేశ్ విడిది చేస్తున్నారు. శుక్రవారం ఆయన పాదయాత్ర చేయలేదు. విడిది కేంద్రంలో స్థానిక నేతలతో సమీక్షలకు పరిమితమయ్యారు. ఈ సమీక్షల్లో భాగంగా స్థానిక నాయకులు సుగుణమ్మ, తిరుపతి కార్పొరేషన్లో ఏకైక టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, నరసింహయాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక, అలాగే టౌన్‌బ్యాంక్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో నేతలు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలో పార్టీకి నాయకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, పని చేసే వాళ్లు తక్కువగా ఉన్నారని మండిపడ్డారు. కష్టపడితేనే పదవులు అడిగే అవకాశం వుంటుందన్నారు. మంగళగిరిలో ఇప్పటికీ తనకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదని లోకేశ్ చెప్పడం గమనార్హం. తద్వారా తిరుపతిలో టికెట్ ఎవరికిస్తామనేది ఇప్పుడే చెప్పమని ఆయన తన స్టైల్లో సుగుణమ్మకు షాక్ ఇచ్చారు.
టీడీపీ అధిష్టానం మనసులో తనపై అనుమానాలున్నాయని సుగుణమ్మ భావిస్తున్నారు. అందుకే తిరుపతి పర్యటనలో సుగుణమ్మ పేరును అధికారికంగా ప్రకటించడానికి లోకేశ్ నిరాకరించారనే ప్రచారం జరుగుతోంది.