కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డి భలే విచిత్రంగా మాట్లాడుతున్నారు. 2009లో చివరి సారిగా ఆయన కమలాపురం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. ఆ జిల్లాలో దివంగత వైఎస్సార్ శిష్యుడిగా గుర్తింపు పొందారు. గత పదేళ్లుగా ఆయన రాజకీయ నిరుద్యోగి. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఆయన మాట్లాడుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ మద్దతుదారుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు ప్రకటించారు.
అయితే ఎన్నికలకు ఒక రోజు ముందు ఆయన వైసీపీ అభ్యర్థి పి.రవీంద్రనాథ్‌రెడ్డికి మద్దతు ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు. అలాగని ఆయన వైసీపీలోనూ, టీడీపీలోనూ లేరు. కమలాపురం నియోజకవర్గంలో తనకు బలమైన అనుచర వర్గం వుందని ఆయన నమ్ముతున్నారు. తాను ఏ పార్టీ తరపున నిలిచినా గెలుస్తాననే భరోసా, ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపిస్తోంది. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులైన ఆదినారాయణరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజులరెడ్డిలతో కలిసి తాను టీడీపీలో చేరుతానని ప్రకటించారు.
తాజాగా మళ్లీ ఆయన కొత్త రాగం ఎత్తుకున్నారు. వైసీపీ, టీడీపీ అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు సర్వేల్లో ప్రజాదరణ ఉన్న వారికే టికెట్లు ఇస్తారని, తనకు నియోజకవర్గంలో బాగుందని, అందువల్ల టికెట్ దక్కొచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే అధికారంలోకి వచ్చే పార్టీ తరపున మాత్రమే తాను పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఈ మాటల ద్వారా ఏ పార్టీ కూడా తన అభ్యర్థిత్వాన్ని కనీసం పరిశీలించకుండా వీరశివారెడ్డి చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరశివారెడ్డి మొదటి నుంచి పార్టీ ఫిరాయింపుల్లో మేటి అని పేరు తెచ్చుకున్నారు.
అదే ఆయనకు మైనస్ కూడా. ఇలాంటి వారికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా… చివరి వరకూ వుంటారనే నమ్మకం లేదని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. లోపాలు ఎన్ని ఉన్నా టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి పార్టీకి నిబద్ధుడై వుంటారని ప్రత్యర్థులు కూడా అంగీకరించే వాస్తవం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వీరశివారెడ్డి తనకు తాను నష్టం కలిగించుకునేలా ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలి.