సీఎం గారూ..ఏపీ న్యాయ‌రాజ‌ధానికి న్యాయం చేయండి

విభజన చట్టం ప్రకారం గోదావరి యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణకు, కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందుతాయి. విభజన జరిగి 7వ సంవత్సరం జరుగుతున్నా ఇప్పటి వరకు అమలు కాకపోవడం ఇప్పటి…

విభజన చట్టం ప్రకారం గోదావరి యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణకు, కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందుతాయి. విభజన జరిగి 7వ సంవత్సరం జరుగుతున్నా ఇప్పటి వరకు అమలు కాకపోవడం ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతే బాద్యత. 

KRMB కార్యాలయం కర్నూలు కు కేటాయించడం సహజ న్యాయం..

రాష్ట్రంలో ప్రవహిస్తున్న కృష్ణ నదికి ముఖద్వారం రాయలసీమలోని కర్నూలు. అంతే కాదు గరిష్ట స్థాయిలో కృష్ణలోకి నీటిని కలుపుతున్న ఉపనది తుంగబద్రకు కూడా కర్నూలే ముఖద్వారం.

బోర్డు విధులు రీత్యా చూసినా తెలంగాణ , ఏపీల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం. తెలంగాణ రాష్ట్ర రాజాధానికి కూడా దగ్గరగా ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండే కర్నూలుకు యాజమాన్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సహజ న్యాయం.

పోలవరంతో కృష్ణతో  అనుబంధం రాయలసీమకే.

కృష్ణా నదిలో ఏపీ వాటా 512 టీఎంసీలు. వాటిలో సింహ భాగం కృష్ణా డెల్టాకు కేటాయించిన కారణంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే కుడికాలవ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అంటే నేడు నాగార్జున సాగర్ ద్వారా కృష్ణ నీరు విడుదల చేసేది పోలవరం పూర్తి అయితే గోదావరి  నీరు విడుదల చేస్తారు.

పులిచింతల కూడా అందుబాటులో కి వచ్చిన నేపద్యంలో కృష్ణ నీటితో మధ్య కోస్త ఆంధ్రకు అనుబంధం తగ్గుతుంది. అప్పుడు కృష్ణ నీటిలో తెలంగాణ వాటా పోను మిగిలిన నీటితో అనుబంధం రాయలసీమ , ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకే ఉంటుంది. అలాంటి సమయంలో యాజమాన్య బోర్డు కార్యాలయం రాయలసీమ లోని కర్నూలులో ఉండటం సహజ న్యాయం అవుతుంది.

న్యాయ రాజధానిగా కర్నూలు చేసిన నేపద్యంలో …..

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలోని కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించినది. అందుకు ఉద్దేశించిన చట్టంలో హైకోర్టుతోబాటు న్యాయ శాఖతో ముడిపడిన కార్యాలయాలను కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలి.

తెలంగాణ , ఏపీ రాష్ట్రాల ఫిర్యాదులను , వివాదాలను పరిష్కరించడం కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధి.  న్యాయం చెప్పేది కనుక న్యాయ స్వభావం కలిగి ఉంటుంది. న్యాయ రాజధానిలో కార్యాలయం ఉండటం కనీస ధర్మం.

పాలనా వికేంద్రీకరణ చేసే క్రమంలో విజిలెన్స్ కు సంబంధించిన కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం చేసిన సమయంలో అమరావతి నాయకత్వం వ్యతిరేకించడం , కోర్టులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. అక్కడ ఉన్న కార్యాలయాలు తరలించడం ఎంత కష్టమో ఈ పరిణామం ఒక హెచ్చరిక.

ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన క్రిష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తే KRMB కర్నూలుకు వస్తుంది.

కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం సహజ న్యాయమైన కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయంను కర్నూలులో ఏర్పాటు చేయాలని అపెక్స్ సమావేశంలో ప్రతిపాదన చేయాలని రాయలసీమ సమాజం ఆశిస్తోంది.

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం