సూపర్ హిట్ సినిమా.. డిజాస్టర్ రీమేక్

రీమేక్ చేయడం చాలా ఈజీ అంటారు కొంతమంది. అదే రీమేక్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమంటారు ఇంకొంతమంది. ఇలా రెండు వైరుధ్యమైన అభిప్రాయాలు రావడానికి కారణం ఒకటే. సినిమాలో సోల్ ను పట్టుకోవడం.…

రీమేక్ చేయడం చాలా ఈజీ అంటారు కొంతమంది. అదే రీమేక్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమంటారు ఇంకొంతమంది. ఇలా రెండు వైరుధ్యమైన అభిప్రాయాలు రావడానికి కారణం ఒకటే. సినిమాలో సోల్ ను పట్టుకోవడం. ఆ సోల్ ను పట్టుకున్నోడు రీమేక్ తో హిట్ కొడతాడు, కథలో ఆత్మను మిస్ అయినోడు అదే రీమేక్ తో ఫ్లాప్ అందుకుంటాడు. తాజాగా బాలీవుడ్ లో వచ్చిన సెల్ఫీ సినిమా పరిస్థితి ఇదే.

మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ గా వచ్చింది హిందీ సెల్ఫీ. మలయాళంలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, ఆ పాత్రల మధ్య సంఘర్షణ, కంటికి కనిపించని ఓ ఎమోషన్ అంతర్లీనంగా నడుస్తుంది. కానీ హిందీ రీమేక్ దగ్గరకొచ్చేసరికి ఇది మిస్సయింది. తెరనిండా అక్షయ్ కుమార్ కనిపించాడు. అక్షయ్-ఇమ్రాన్ మధ్య సంఘర్షణను ఎంగేజింగ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు.

ఇంకా చెప్పాలంటే, ఏమాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఇగోలకు పోయి ఎలా వ్యవహరించారో చెప్పాల్సిన సందర్భంలో.. ఆ ఇద్దర్నీ బద్ధశత్రువులుగా చూపించే ప్రయత్నం జరిగింది ఈ సెల్ఫీలో. సరిగ్గా ఇక్కడే సినిమా రిజల్ట్ బెడిసికొట్టింది. పఠాన్ తో బాలీవుడ్ గాడిలోకి వచ్చిందనుకున్న జనాలకు తన 'సెల్ఫీ'తో నిరాశ మిగిల్చాడు అక్షయ్ కుమార్. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

మలయాళం డ్రైవింగ్ లైసెన్స్ లో కథ మాత్రమే చెప్పారు, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కానీ సెల్ఫీలో అక్షయ్ కుమార్ మాత్రమే కనిపిస్తాడు. ఫస్టాఫ్ లో తనదైన టైమింగ్ లో కామెడీ చేస్తాడు, ఇమ్రాన్ హస్మి కూడా అదే పని చేశాడు. సెకెండాఫ్ నుంచి డ్రామా షురూ చేశారు. అయితే అక్కడ కూడా ఇగో వార్ ను సరిగ్గా ప్రజెంట్ చేయడంలో అంతా తడబడ్డారు. ఎలా నటించాలో తెలియక అక్షయ్-ఇమ్రాన్ ఇద్దరూ కళ్లు తేలేశారంటూ బాలీవుడ్ మీడియా ఏకిపడేస్తోంది.

పూర్తిగా అక్షయ్ కుమార్ స్టార్ డమ్ మీద ఆధారపడి తీసిన ఈ రీమేక్ సినిమాలో, ఒరిజినాలిటీ మిస్సయింది. అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కు ఇది నచ్చుతుందేమో కానీ, ఓవరాల్ గా మాత్రం ఇది బాలీవుడ్ జోరుకు బ్రేకులేసినట్టే. పఠాన్ లాంటి పెద్ద హిట్ తర్వాత, ఓ స్టార్ హీరో సినిమా ఇలా డిజాస్టర్ టాక్ తో మొదలవ్వడం విచిత్రం. అయితే మొదటి రోజే ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం అక్షయ్ కుమార్ కు కొత్త కాదు. కాకపోతే రీమేక్ రాజాగా పేరు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ స్టార్, ఈసారి అదే రీమేక్ తో డిజాస్టర్ అందుకోవడం బాధాకరం.