దీపం వుండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ యువ మహిళా నాయకురాలు తనదైన శైలిలో అధికార పార్టీతో బేరానికి దిగినట్టు సమాచారం. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ నాయకురాలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక్కో క్రిమినల్ యాక్టివిటీ చెబితే… ఓ ఆ నాయకురాలా అని రాజకీయాలకు అతీతంగా చెప్పే స్థాయికి దిగజారారు.
తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సొమ్ము చేసుకోడానికి సదరు వివాదాస్పద నాయకురాలు తన పార్టీకి చెందిన సర్పంచ్‌ను బరిలో దింపినట్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరపున బోయ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఎ.మధుసూదన్ నామినేషన్ వేశారు. ఈయనతో మరో ముగ్గురు టీడీపీ సర్పంచులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడడం చర్చనీయాంశమైంది.
ఈ ముగ్గురిలో ఓ సర్పంచ్ ఇంటి పేరు చూస్తే… వైసీపీతో బేరం ఆడుతున్న ఆ మహిళా నేత ఎవరో వెంటనే పసిగడతారు. ఎందుకంటే ఆ ఇంటిపేరుతో కర్నూలు జిల్లాలో ఒకప్పుడు ఆ కుటుంబం ఓ వెలుగు వెలిగింది. తాజాగా వారసుల పుణ్యమా అని పరువు కాస్త గంగలో కలిసిపోయిందనే అభిప్రాయం వుంది. రానున్న ఎన్నికల్లో ఆ మహిళా నాయకురాలికి టీడీపీ టికెట్ ఇవ్వదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ నాయకురాలు తన సర్పంచ్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయించారు.
ఈ నెల 27వ తేదీ వరకూ విత్‌డ్రాకు గడువు వుంది. దీంతో సదరు నాయకురాలు వైసీపీతో మధ్యవర్తుల ద్వారా బేరానికి పంపినట్టు సమాచారం. రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల లోపు సొమ్ము ఇస్తే విత్ డ్రా చేయిస్తానని ప్రతిపాదన పంపినట్టు తెలిసింది. అయితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఇవ్వడానికి వైసీపీ సిద్ధమైంది. మధ్యే మార్గంగా మరో రూ.5 లక్షలు పెంచి, రూ.15 లక్షలతో సరిపెట్టుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
కోటి విద్యలు కూటి కోసమే అనే చందంగా… స్వతంత్ర అభ్యర్థుల పేరుతో నామినేషన్లు వేయడం వెనుక ఆర్థిక లావాదేవీలున్నాయనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇదిలా వుండగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా పెద్ద కుటుంబంగా పేరొంది… ఇప్పుడు రూ.5 లక్షలు, రూ.10 లక్షలకు కక్కుర్తి పడడంపై టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.