కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ఇకపై ఆయన పార్టీ మార్పుపై స్పందించనంటూనే… తన మనసులో మాటను బయట పెట్టారు. సోము వీర్రాజు వైఖరి నచ్చకనే బీజేపీ నుంచి బయటికి వచ్చినట్టు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజును దెబ్బతీసేలా కన్నా తన వంతు ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం కన్నా ఆరోపణలను పట్టించుకోలేదు. వీర్రాజుకు గట్టి మద్దతు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కన్నా టీడీపీలో చేరడంపై మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పార్టీ మారడానికి ఒక ఎజెండా వుందన్నారు. తాను 42 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నట్టు వీర్రాజు చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి వెళ్లిపోయిన వాళ్ల గురించి తనను అడిగితే ఎట్లా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ పార్టీలో అసంతృప్తి వుంటే పెద్దలతో మాట్లాడాలన్నారు. పార్టీ మారిపోరు కదా అని ఆయన ప్రశ్నించారు.
అసంతృప్తి ఉన్నా, పార్టీలోనే వుంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ అధికారంలోకి రావాలన్నారు. సోము వీర్రాజుకు వ్యతిరేకంగా టీడీపీ అనుకూల బీజేపీ నేతలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేందుకు టీడీపీ తన నాయకుల ద్వారా దూకుడు పెంచింది.
ఈ పరంపరలోనే వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి ఓ టీమ్‌ను కూడా పంపించింది. తమ పార్టీతో బీజేపీ పొత్తుకు వీర్రాజు అడ్డు పడుతున్నారనేది టీడీపీ నేతల ఆవేదన అందుకే ఆ అడ్డును తొలగించుకునేందుకు వీర్రాజుపై అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.