సైకో ఎవ‌రు?

‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనే నినాదంతో టీడీపీ జ‌నంలోకి వెళుతోంది. ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో ఒక్కో రాజ‌కీయ పార్టీ త‌న‌కిష్ట‌మైన రీతిలో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు ప్ర‌చారాన్ని చేప‌ట్ట‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. సీఎం జ‌గ‌న్‌ను సైకోగా చిత్రీక‌రిస్తూ రాజ‌కీయ…

‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనే నినాదంతో టీడీపీ జ‌నంలోకి వెళుతోంది. ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో ఒక్కో రాజ‌కీయ పార్టీ త‌న‌కిష్ట‌మైన రీతిలో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు ప్ర‌చారాన్ని చేప‌ట్ట‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. సీఎం జ‌గ‌న్‌ను సైకోగా చిత్రీక‌రిస్తూ రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే అంతిమంగా ప్ర‌జ‌లే న్యాయ నిర్ణేత‌లు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌ల‌తో పాటు టీడీపీ నేత‌లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఎవ‌రూ చేయ‌ని రీతిలో టీడీపీని జ‌గ‌న్ ధ్వంసం చేశార‌ని తండ్రీత‌న‌యుడు ర‌గిలిపోతున్నారు. చంద్ర‌బాబు త‌న వ‌య‌సు, అనుభ‌వాన్ని కూడా మ‌రిచిపోయి జ‌గ‌న్‌పై రంకెలు వేస్తున్నారు. లోకేశ్ విమ‌ర్శ‌ల గురించి ఇక చెప్పాల్సిన ప‌నేలేదు. ఆయ‌న నోరు తెరిస్తే …జ‌గ‌న్‌ను అరేయ్, ఒరేయ్‌, సైకో నాకొడ‌కా అంటూ బూతులు తిడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం గ‌న్న‌వ‌రంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు మ‌రో అడుగు ముందుకేశారు. ధ్వంస‌మైన టీడీపీ కార్యాలయాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ అధికార పార్టీ నేత‌లు ఉగ్ర‌వాదుల్లో ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అంతా ఓ ప్లాన్ ప్ర‌కార‌మే వైసీపీ శ్రేణులు దాడుల‌కు తెగ‌బడ్డాయ‌ని ఆరోపించారు. దొంగ దెబ్బలు, దొంగాటలు వద్దని అన్నారు. లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందాం అని ఆయ‌న సవాల్ చేశారు. అది పోలీసులు లేకుండా రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ధైర్యం ఉంటే సైకో కూడా రావాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.  

సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబునాయుడు మాట్లాడాల్సిన మాట‌లేనా ఇవి? ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో సీఎం, ప్ర‌తిప‌క్ష నేత‌లు ముహూర్తాలు పెట్టుకుని మ‌ల్ల‌యుద్ధానికి దిగుతారా? ఆచ‌ర‌ణ‌కు సాధ్యం కాని అంశాల‌పై చంద్ర‌బాబు స‌వాల్ విస‌ర‌డం వెనుక దురుద్దేశం ఏంటి? ఇదంతా మీడియా అటెన్ష‌న్‌, త‌న శ్రేణుల్ని ఉత్సాహ‌ప‌ర‌చ‌డానికి త‌ప్ప‌, మరో దానికి ఈ మాట‌లు ప‌నికొస్తాయా? ఎటూ మ‌రో 14 నెలల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపితే స‌రిపోతుంది. 

క‌నీసం వ‌య‌సుకు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా త‌న ప‌ద‌వికైనా గౌర‌వం తెచ్చేలా చంద్ర‌బాబు మాట్లాడితే బాగుంటుంది. తానొకటి మాట్లాడి, చిన్న వాళ్లైన అధికార పార్టీ నేత‌ల‌తో ప‌ది తిట్లు తినడం బాబుకు స‌ర‌దానేమో అనుమానం క‌లుగుతోంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్లను సైకో లేదా శాడిస్టు అనాలా? అనే ప్ర‌శ్న‌కు మేధావి అయిన చంద్ర‌బాబే జ‌వాబు చెప్పాలి.