'ఎప్పుడో నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నారేమో.. మాకు అధికారం రావడం ఆ తర్వాతేనని మీరు అనుకోవచ్చుగాక.. కానీ, నేడో.. రేపో.. ఎల్లుండో.. అధికారంలోకి రాబోతున్నాం..' అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా టూర్‌లో భాగంగా చంద్రబాబు అధికార పార్టీపైనా, పోలీసు వ్యవస్థపైనా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న విషయం విదితమే.ఈ క్రమంలో చంద్రబాబు నోటి వెంట పైన పేర్కొన్న 'ఆణిముత్యాలు' అలా అలా జాలువారాయి.అవునా.? వైఎస్ జగన్ ప్రభుత్వం నేడో, రేపో కూలిపోతుందా.? రేపో, ఎల్లుండో చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తారా.?
రాజకీయం అంటే మరీ చంద్రబాబుకి హాస్యాస్పదం అయిపోయినట్టుంది. అధికారం అంటే, తన అరచేతిలోని వ్యవహారం.. అనే భ్రమల్లోంచి చంద్రబాబు ఇంకా బయటకు రావడంలేదు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ నెంబర్, 2014 నుంచి 2019 ఎన్నికల మధ్యన చంద్రబాబు ప్రోత్సహించిన ఫిరాయింపుల లెక్క.
'ఏదైతే చంద్రబాబు కోరుకున్నారో, అదే ఆయనకి దేవుడిచ్చాడు..' అని సాక్షాత్తూ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, చంద్రబాబుని ఎద్దేవా చేసిన విషయం విదితమే. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తోంది.
రాజధాని పేరుతోనో, ఇంకో పేరుతోనో వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఎంతలా బురద జల్లాలనుకున్నా ప్రయోజనం వుండదు.ఇంకో నాలుగున్నరేళ్ళ వరకూ చంద్రబాబు, అధికారం గురించిన ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఆ తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ వుంటుందా.? వుండదా.? అన్నదే చర్చ తప్ప, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే చర్చ ఎక్కడా జరగడంలేదాయె.
వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోకుండా రాజకీయాలు చేస్తున్నందుకే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడీ దుస్థితి దాపురించింది. వీలైనంత త్వరగా తెలుగుదేశం పార్టీని కాలగర్భంలో కలిపేయాలనుకుంటున్నారేమో.. అందుకే నేడో, రేపో, ఎల్లుండో.. అంటూ సోయలేని మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు.