డెహ్రాడూన్ లో జరుగుతున్న భారత చట్టసభల అధ్యక్షుల సమావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల విషయంలో కఠినంగా ఉండాలని ఆయన అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ చట్టం అమలు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీల గీత దాటే ఎమ్మెల్యేలపై , ఎంపీలపై వేటు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపును సహించేది లేదని ఇది వరకే స్పీకర్ గా తమ్మినేని ప్రకటించారు. అదే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో వివరించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ఐదేళ్లలో ఫిరాయింపులను ఇష్టానుసారం ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. వారిలో నలుగురికి మంత్రి పదవులను కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
ఆ రాజకీయానికి బాధితురాలు అయిన వైసీపీ ఫిరాయింపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సమావేశంలోనూ తమ్మినేని చెప్పారు.దీంతో ఏపీలో అధికార పార్టీలోకి చేరాలనుకునే ఎమ్మెల్యేలకు మరోసారి ఆశాభంగం ఎదురైనట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చేరడానికి తెలుగుదేశం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తూ ఉన్నారు.
అయితే ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజీనామా షరతును పెడుతూ ఉన్నారు. దీంతో వారు వెనుకడుగు వేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి వారు సిద్ధంగా కనిపించడం లేదు. వల్లభనేని వంశీ విషయంలో తెలుగుదేశం పార్టీ తొందరపాటు ఆయన మనుగడకు ప్లస్ అయ్యింది. వంశీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. దీంతో ఆయన తనను స్వతంత్రుడిగా గుర్తించాలంటూ స్పీకర్ ను కోరారు. తీరా తమ తొందరపాటుకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చింతిస్తున్నట్టుగా ఉంది.