'పోలీసులను పక్కన పెట్టండి.. మీరో, మేమో తేల్చుకుందాం రండి.. ఎక్కడకు రమ్మంటారో చెప్పండి..' అన్నారు తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. అనంతపురం వెళ్లగానే తన బామ్మర్ది సినిమా డైలాగులు గుర్తుకు వచ్చాయోమో కానీ.. ఏ సెంటరైనా రెడీ అంటున్నారు చంద్రబాబు నాయుడు. పోలీసులను పిల్చుకురావొద్దని.. వైసీపీ నేతలు రావాలని.. తేల్చుకుందాం.. అంటూ చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు.
వీధి రౌడీలు మాట్లాడే మాటలను తెలుగుదేశం అధినేత మాట్లాడారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు వద్దంటూ.. వీధి పోరాటానికి రావాలంటూ తెలుగుదేశం అధినేత తన రాజకీయ ప్రత్యర్థులను చంద్రబాబు నాయుడు పిలవడం గమనార్హం. తేల్చుకుందామంటూ సవాల్ విసరడం విశేషం. సాధారణంగా ఆకు రౌడీలు, టీ కొట్ల వద్ద గొడవ పడే వాళ్లు ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటారు.
అంతే కాదు..చంద్రబాబు నాయుడు మరో విషయాన్ని కూడా చెప్పారు. తను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుని ఉంటే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ మిగిలే వారు కాదని ఆయన ప్రకటించారు. వారిని అంతు చూసే వాళ్లం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పారు.
అయినా అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలను ఎక్కడ మిగలనిచ్చారు? ఎంత మందిని వీలైతే అంతమందిని కొనేసుకున్నారు కదా! బెదిరించో.. బతిమాలో.. అప్పుడు వైసీపీ నేతలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చేసుకున్నారు కదా!
ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయలసీమలో తిరుగుతుంటే.. కనిపిస్తున్నది ఆ ఫిరాయింపు నేతలే. వాళ్లను చూసి చంద్రబాబు, చంద్రబాబును చూసి వాళ్లు బోరు మంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు తను తలుచుకుంటే.. వైసీపీలో నేతలు మిగిలే వారు కాదంటూ మాట్లాడటం మరో ప్రహసనం!