మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబానాయుడలో రోజురోజుకూ ‘ఉన్మాదం’ పెరిగిపోతోంది. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత బాబు బాబులా లేకుండా పోతున్నారు. బహుశా ఆయన తన కంటే సీఎం జగన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. జగన్ గుర్తొస్తే చాలా బాబు ఉన్మాదిలా, అపరిచితుడిలా మారిపోతున్నారు.
జగన్‌పై అక్కస్సు వెళ్లగక్కేందుకు ఊగిపోతున్నారు. గట్టిగట్టిగా అరుస్తున్నారు. అది అసెంబ్లీ అయినా, వెలుపలైనా…ఎక్కడైనా బాబులో అదే తీరు. గతంలో బాబులో ఇలాంటి వైఖరిని ఎప్పుడూ, ఎవరూ చూడలేదు.అనంతపురం జిల్లాలో ఆయన రెండురోజులుగా పర్యటిస్తున్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడుతూ ఉన్మాదిగా మారిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని బాబు గర్జించారు.
మరి ఆయన ఇప్పుడు జగన్‌ను ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు సీఎంగా ఉండడానికి వీల్లేదని జనం సాగనంపారు. మరి ఈయనేమో జగన్ ఉండడానికి కాదు, కూడదని రంకెలేస్తున్నారు.అనంతపురంలో అదే సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌కు పిచ్చి అని, దాన్ని అధికారులకు కూడా ఎక్కిస్తున్నాడని ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.
జేసీ ట్రావెల్స్‌పై అధికారుల దాడులను ప్రశ్నిస్తూ ఇది జగన్ ఉన్మాద చర్య కాదా అని ప్రశ్నించారు. మరి రవాణాశాఖ అధికారులు ట్రావెల్స్‌పై దాడులు చేయక, మరెక్కడ చేయాలో, ఏం చేయాలో బాబుగారే సెలవిస్తే బాగుంటుంది. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఎస్వీ రవిపై పీడీ యాక్ట్ పెట్టించడం కూడా ఉన్మాద చర్యగా బాబు అన్నారు.
‘జగన్ ఒక ఉన్మాది. పిచ్చోడి చేతిలో రాయిలా ఆయన పాలన మారింది’ అని అనంతపురంలో విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్‌లో గొడవ సందర్భంగా జగన్‌ను ఉన్మాది అనడం, ఆ అంశం అసెంబ్లీలో వివాదం కావడం తెలిసిందే. విజయవాడలో విలేకరుల సమావేశంలో పదేపదే జగన్‌ను ఉన్మాది, ఉన్మాది అంటూ విమర్శలు గుప్తిస్తున్నారు.
జగన్ ఉన్మాది సంగతేమో కానీ, అధికారం పోయిన తర్వాత తానేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో దిక్కుతోచని స్థితిలో ఓ ఉన్మాదిగా మారిపోతున్నారనే వాస్తవాన్ని బాబు గ్రహించలేక పోతున్నారు. కాసేపటి క్రితం మాట్లాడిన అంశానికి విరుద్ధంగా ఇటీవల బాబు మాట్లాడుతున్నారు. ఒక వైపు వయస్సు పైబడుతుండడం, మరోవైపు రాజకీయంగా టీడీపీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడం, లోకేశ్ అంతగా రాణించలేకపోతుండడం…ఇలా అనేక కారణాలు బాబును స్థిమితంగా ఉంచడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి