ఒక ప్రముఖ సినిమా వస్తోందంటే.. మరొకరు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం సంగతి అటుంచితే..క్యూలో ఉంటూ కూడా ఒకరి కోసం మరొకరు దారి వదులుతూ వస్తున్నారు తెలుగు సినిమా రూపకర్తలు. చెప్పుకోదగిన సినిమాలు.. ప్రముఖ హీరోల సినిమాలు… మరీ సీజన్లో తప్ప ఒకే రోజు విడుదల అవుతున్న దాఖలాలు కనిపిస్తుండటం లేదు ఈ మధ్య. ఒక సినిమాతో మరొకరు నష్టపోకుండా.. విడుదలలు ప్లానింగ్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అందులో చిన్న మార్పు.
ఈ రోజులు నాలుగు ప్రముఖ సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిల్లో బాలకృష్ణ రూలర్, ధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగేతో పాటు.. రెండు అనువాద సినిమాలున్నాయి. వాటిల్లో ఒకటి తమిళం నుంచి అనువాదం అయిన కార్తీ సినిమా దొంగ, మరోటి హిందీ నుంచి డబ్ అయిన దబంగ్ త్రీ. ఇలా బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాల మధ్యన పోటీ నెలకొంది.
బాలకృష్ణ రూలర్ గురించి నందమూరి అభిమానులు, ప్రతి రోజూ పండగ గురించి మెగాభిమానులు ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఆ ఫ్యాన్స్ కు ఈ రోజు ఫుల్ మజా. ఇక కార్తీ ఇటీవలి సినిమా ఖైదీ ఆకట్టుకుంది. దీంతో దొంగ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కార్తీ, జ్యోతిక కలిసి నటించిన సినిమా ఇది.
ఇక దబంగ్ సినిమా క్రేజ్ కేవలం హిందీకే పరిమితం కాలేదు. దీంతో దబంగ్ త్రీ హిందీ వెర్షన్ కు అయినా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఇలా నాలుగు సినిమాల మధ్యన ఈ రోజు బాక్సాఫీస్ పోటీ ఉంది. వీటిల్లో ఏవి ఆకట్టుకుంటే.. అవి రేపటి నుంచి కలెక్షన్స్ ను పంచుకోనున్నాయి.