అమరావతి కలుగులో టీడీపీ ఎలుకలు

అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చదివిన భూ బకాసురుల చిట్టా అంతకంటే ఎక్కువ సెన్సేషన్ గా మారింది.…

అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చదివిన భూ బకాసురుల చిట్టా అంతకంటే ఎక్కువ సెన్సేషన్ గా మారింది. రాజధాని ప్రాంతంలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల స్థలాలు ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం తెప్పించుకుని మరీ చదివి వినిపించారు బుగ్గన. 

దీంతో తమ చీకటి వ్యవహారమంతా బైటపడిపోయిందని తెగ ఇదైపోతున్నారు టీడీపీ నేతలు. కలుగులో నుంచి బైటకొచ్చిన ఎలుకల్లా ఒక్కొక్కరూ బైటకొస్తున్నారు, బుకాయిస్తున్నారు. అసలు రాజధాని ప్రాంతంలో తనకు భూములే లేవని, తన బంధువులు, మిత్రులు భూములు కొనుక్కున్నారని బీద అరుపులు అరుస్తున్నారు మాజీ మంత్రి నారాయణ.

ఆర్థిక మంత్రి బుగ్గన కూడా నారాయణకు స్థలాలు, పొలాలు ఉన్నాయని చెప్పలేదు, ఆయన బినామీల పేర్లు చదివి మరీ 55 ఎకరాలకు పైగా భూములు పోగేసుకున్నారని వివరించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని తెలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోండి అంటూ బీరాలు పోతున్న నారాయణ, తన బినామీలు అక్కడెందుకు ఆస్తులు కొన్నారో, అది కూడా రాజధాని ప్రకటన రావడానికి ముందు మూకుమ్మడిగా తన మిత్ర బృందం ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిందో ఆయనే చెప్పాలి.

నారాయణకు తోడు ధూళిపాళ్ల నరేంద్ర, పుట్టా సుధాకర్ యాదవ్, వేమూరి రవి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. ఎవరికీ బినామీలుగా ఉండాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. తప్పులు చేసి అంత తేలిగ్గా దొరికిపోవడానికి వారేమీ ఆషామాషీ మనుషులు కాదు కదా, అప్పట్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు. అందుకే అన్నీ పక్కాగా లెక్క చూసుకుని మరీ బినామీలను రంగంలోకి దింపారు. తాము బినామీలుగా ఉండాల్సిన వారి కోసం కూడా తమ బినామీలను తెరపైకి తెచ్చారు.

అలా అలా ఎకరాలకెకరాలు టీడీపీకి చెందిన నేతలు పోగేసుకున్నారు. తమవాళ్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మొత్తమ్మీద బుగ్గన చదివిన లిస్ట్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. టీడీపీలోనే చాలామంది తమ తోటివారి టాలెంట్ చూసి షాకవుతున్నారు. తమ పక్కనే ఉంటూ తమకు తెలియకుండా ఎన్ని ఎకరాలు కొన్నారో తెలిసే సరికి అవాక్కవుతున్నారు. అలా ఇన్నాళ్లూ అమరావతి కలుగులో దాక్కున్న టీడీపీ నేతల బండారాలన్నీ ఇప్పుడిలా బయటకొచ్చాయి.