సహజంగా ఏ మనిషిపైనైనా కోపం, ద్వేషం …అతని చావుతో పాటు చచ్చిపోతాయి. కానీ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై మాత్రం…ఒకవేళ ఉరిశిక్షకు ముందే చనిపోతే శవాన్ని కూడా విడిచిపెట్టొద్దని అక్కడి కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అంతేకాదు ముషారఫ్ శవాన్ని మూడు రోజులు ఉరి తీయాలని తీర్పునివ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచనలకు అందడం లేదు.
ముషారఫ్ నేరారోపణలపై విచారించిన పాకిస్తాన్ కోర్టు రెండురోజుల క్రితం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు ముషారఫ్‌కు ఉరిశిక్ష విధించాలని తీర్పు ఇవ్వగా, మరొకరు విభేదించారు. ఈ మేరకు ఇద్దరు జడ్జిలు 167 పేజీల తీర్పు రాశారు. ఆ ప్రతులు బయటికొచ్చాయి. ఇందులో పాయింట్ల వారీగా తీర్పు రాశారు. 65, 66 పాయింట్లలో ఘాటుగా రాశారు.
‘నిందితుడిపై ఆరోపణల ప్రకారం ముషారఫ్ దోషి. దోషిని చనిపోయే వరకు ఉరితీయాలి. పరారీలో ఉన్న దోషిని పట్టుకుని తీసుకురావాల్సిందే. ఒకవేళ దోషి శవం దొరికితే, దాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఆ శవాన్నే ఉరితీయాలి’ అని కోర్టు తీర్పులో పేర్కొన్నారు.
ఈ తీర్పు చదువుతున్న వారికే భయమేస్తుంటే…శిక్ష అనుభవించాల్సిన ముషారఫ్ మానసిక స్థితి ఎలా ఉంటుందోననే ఊహే మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఏది ఏమైనా శత్రువులకు కూడా ఇలాంటి శిక్షలు ఉండకూడదనేలా ముషారఫ్‌పై ఉరిశిక్ష కామెంట్స్ ఉన్నాయి.