ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కానుంది. తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించే అవకాశం ఉంది. మూడు ప్రాంతాల్లో 3 రాజధానాలు ఉండవచ్చంటూ అసెంబ్లీలో జగన్ సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో, ఈరోజు ముఖ్యమంత్రికి కమిటీ అందించనున్న నివేదిక ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
సీఎం క్యాంప్ ఆఫీస్ లో మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యమంత్రిని కలవనుంది కమిటీ. కొన్ని కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరిస్తుంది. అదే సమయంలో తమ అధ్యయన నివేదికను అందిస్తుందా లేక మరికొంత సమయం కోరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కమిటీ నివేదికలో ఉన్న కీలక అంశాన్నే కాస్త ముందుగా జగన్, అసెంబ్లీలో ప్రకటించారంటున్నారు మరికొంతమంది.
స్వయంగా జగన్, అసెంబ్లీలో 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా ఏర్పాటు చేయొచ్చంటూ ప్రకటించారు. దీంతో కమిటీ ఇచ్చే నివేదికలో కూడా దాదాపు ఇదే విషయం ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.
అయితే 3 రాజధానుల అంశంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. నిరసన కార్యక్రమాలకు దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఈ అంశాన్ని రచ్చరచ్చ చేస్తోంది. ఇవాళ్టి నుంచి జనసేన కూడా రాజధాని ప్రాంతంలో వివిధ నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జగన్ చెప్పిన మూడు రాజధానుల పాయింట్ నివేదికలో ఉందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.