మొండివాడు రాజుకంటే బలవంతుడని చెబుతారు. కానీ రాజే మొండివాడైతే…ఇక చెప్పేదేముంది. రాజు అనుకున్నదే చట్టం. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జగమొండి అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇటీవల పదేపదే అంటున్నారు. మూడురోజుల క్రితం ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందంటూ అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలులో కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు కొన్నింటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రకటించారు.
రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు గత టీడీపీ పాలకులు పాల్పడ్డారని, దాదాపు 4,070 ఎకరాలను తక్కువ రేటుకు కొనుగోలు చేశారని ఆధారాలతో సహా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పాడు. అంతేకాకుండా రాజధానిలో అసైన్డ్ భూమి కొనుగోలును రద్దు చేస్తూ వైసీపీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకొంది. దీంతో టీడీపీ వ్యాపారవేత్తలకు ఊపిరాడడం లేదు. ఇలాగైతే తమను బతకనివ్వరనే భయం వారిలో గుండె దడను పెంచుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఏర్పాటు చేయనున్న మూడు రాజధానులను అడ్డుకోవాలని టీడీపీ పెద్దలు భారీ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. అసలే జగన్ మొండివాడని, పార్టీ పరంగా ఏమీ చేయలేమనే నిర్ణయానికి వారు వచ్చారని తెలిసింది. అంతే కాకుండా జగన్ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జగన్ నిర్ణయంపై ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు ఆనందంతో ఉన్నారు.
ఇపుడు కేవలం రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు మాత్రమే ఆందోళనలో ఉన్నారు. అందువల్లే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అమరావతి వరకే బంద్‌కు పిలుపునిచ్చారు. అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా కేవలం రాజధాని రైతుల పేరుతోనే. ఈ నేపథ్యంలో రాజధానిపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన 585 జీవోని సవాల్ చేస్తూ రైతుల పరిరక్షణ పేరుతో హైకోర్టు మెట్లు ఎక్కారు.
రాజధాని కోసమని ప్రభుత్వం రైతుల భూములు తీసుకొందని, ఇప్పుడు మళ్లీ కమిటీ వేయడం సరికాదని ఆ పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. వెంటనే జీవో 585ను రద్దు చేయాలని కోరారు. ఫిబ్రవరి 3కి కేసు వాయిదా వేస్తూ ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ అధికారులకు నోటీసులు పంపారు. వాయిదా సమయం పూర్తయ్యేలోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదన్నమాట టీడీపీ లా మార్క్ ఎత్తుగడ.