టీటీడీలో ఏం జరుగుతోంది? వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం ద్వారా పదిరోజుల పాటు భక్తులకు దన్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు గత కొంత కాలంగా అనధికారికంగా ప్రచారం చేస్తూ వచ్చారు. అంతేకాదు ఈ నెల 28న టీటీడీ పాలక మండలి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవడమే తరువాయనే ప్రచారం కూడా సాగింది. ఈ లోపు ఏం జరిగిందో తెలియడం లేదుకానీ, నిర్ణయంలో మార్పు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమేనని తేల్చి చెప్పారు. మొదటగా అనుకున్నట్టు పదిరోజులు కాదని ఆయన తెలిపారు. తిరుమలకు వచ్చిన శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామిని కలిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. దీంతో భక్తులు ఒక్కసారిగా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
అయితే వైకుంఠ ద్వారం ద్వారా పదిరోజుల పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ద్వారా లక్షలాది మంది హిందువులను స్వామి వారికి మరింత చేరువ చేయవచ్చని టీటీడీ ప్రత్యేక అధికారైన అదనపు జేఈఓ ధర్మారెడ్డి సంకల్పించారు. ఇందుకోసం ఆయన చినజియర్ స్వామి తదితర పెద్దపెద్ద స్వాములతో నేరుగానూ, మరికొందరితో ఫోన్‌లోనూ సంప్రదించి పక్కాగా ప్రణాళిక రచించారు.
ధర్మారెడ్డి మాస్టర్ ప్లాన్ వెనుక జగన్‌కు రాజకీయంగా ప్రయోజనం కలిగించే అంశం కూడా ఉందనేది ఒక వాదన. వైఎస్ జగన్ క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని మతమార్పిళ్లకు పాల్పడుతున్నారంటూ పనిగట్టుకుని ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ధర్మారెడ్డి దాన్ని తిప్పికొట్టేందుకు వినూత్నంగా ఆలోచించారని సమాచారం. ఇందులో భాగంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజుల్లో 10 లక్షల మంది భక్తులకు చేయిస్తే దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించడంతో పాటు గతంలో ఏ ముఖ్యమంత్రి హిందుత్వ భావజాల అభివృద్ధికి కృషి చేయనంతగా జగన్ చేస్తున్నాడనే సందేశాన్ని పంపవచ్చని ధర్మారెడ్డి సృజనాత్మకంగా ఆలోచించారని చెబుతారు.
టీటీడీకీ ధర్మారెడ్డి కొత్తకాదు. గతంలో ఆయన వైఎస్ హయాంలో 2004, జూలై 5 నుంచి 2006 సెప్టెంబర్ 9 వరకు జేఈఓగా ప్రత్యేక హోదాలో ఉన్నారు. టీటీడీలో శీఘ్రదర్శనం ప్రవేశ పెట్టి పెద్ద సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంలో ఆయన పాత్ర కీలకం. ఆయన సేవలను గుర్తించిన వైఎస్ తిరిగి రెండోసారి 2008 ఏప్రిల్ 2న నియమించారు. అప్పటి నుంచి 2010 ఆగస్టు 31 వరకు కొనసాగారు.
తిరుమల నాలుగు మాఢవీధుల విస్తరణ, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని ప్రతి ఒక్క భక్తుడు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసిన ఘనత ధర్మారెడ్డిదే. తొక్కిసలాట లేకుండా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతో లక్షలాది మంది భక్తులకు శ్రీవారి వాహన సేవలు తిలకించే మహాభాగ్యం కలిగింది.
వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణం చేయించారు. అలాగే ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే ఆశయంతో ప్రతి రోజూ లక్షా యాభై వేల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకున్న థర్మారెడ్డికి మంచి గుర్తింపు తెచ్చింది. బూందీ పోటు తయారీ కేంద్రం మార్పు ఈయన హయాంలో జరిగింది.
ఒకొక్కొటిగా అనేక సంస్కరణలు చేపట్టిన ధర్మారెడ్డి …అదే స్ఫూర్తితో పది లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించాలని కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నతరుణంలో ఆ ‘ధర్మా’నికి అడ్డుపడిందెవరనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.