‘నేను తలచుకుంటే వైసీపీ ఉండేది కాదు. ఆ పార్టీలో ఒక్కరు కూడా ఉండేవారు కాదు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కొంత మంది పో్లీసులు పనిగట్టుకుని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. పోలీసులను పక్కన పెట్టి యుద్ధానికి రా జగన్. అప్పుడు ఎవరి బలమెంతో తెలిసిపోతుంది’….ఇది అనంతపురం టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విసిరిన సవాల్.
తన స్థాయిని మరిచి ‘కొట్టుకుందాం రా’ అని జగన్‌ను చంద్రబాబు పిలిచినట్టు ఉంది. అనంతపురం జిల్లాలో టీడీపీకి మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ కేవలం ఉరవకొండ, కదిరిలో మాత్రం గెలుపొందింది. అదే 2019కి వచ్చేసరికి రివర్స్ అయ్యింది. హిందూపురం, ఉరవకొండలో మినహాయిస్తే మిగిలిన 12 చోట్ల వైసీపీ గెలుపొందింది.
క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తల బలం ఉండడంతో ఆ జిల్లాపై బాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు.కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో ఆయన వీధి భాష మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
'పోలీసులను పక్కన పెట్టి యుద్ధానికి రా జగన్. అప్పుడు ఎవరి బలమెంతో తెలిసిపోతుంది’ అని చంద్రబాబు సవాల్ విసరడం ఏంటి? ఆరు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తనను చిత్తుచిత్తుగా ఓడించారనే విషయాన్ని బాబు మరిస్తే ఎట్లా? స‌్వయాన తన కుమారుడిని కూడా మంగళగిరిలో గెలిపించుకోలేదనే చేదు నిజాన్ని బాబు గుర్తించకపోవడం న్యాయమా?
ప్రజాస్వామ్యంలో ఎన్నికల క్షేత్రమే యుద్ధక్షేత్రం. ఎన్నికలంటే కుస్తీ పోటీలు కాదు కదా? వ‌్యూహాలు, ప్రతి వ్యూహాలు, డబ్బు, కులం, మతం, ఎన్నికల మేనేజ్‌మెంట్….తదితర అంశాలు పార్టీ గెలుపులో కీలకం. అన్నింటిలో ప్రత్యర్థుల కంటే మిన్నగా జనాదరణను పొందిన వారే విజేతగా నిలుస్తారనే సంగతి బాబుకు తెలియకుండానే మాట్లాడుతున్నారా?
2014లో సీఎం అయిన వ్యక్తి …2019లో ఓటమిని జీర్ణించుకోలేక…సీఎంను పట్టుకుని రా తేల్చుకుందాం అని పిలవడం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న బాబు స్థాయికి తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.