అమరావతి అంటూ కలవరించిన చంద్రబాబు తన అయిదేళ్ళ పాలనలో గట్టిగా అయిదు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. పైగా ఇందులో కూడా ప్రభుత్వం పెట్టిన సొమ్ము కేవలం 270 కోట్లు మాత్రమే. మిగిలినదంతా భారీ వడ్డీలకు తెచ్చిన అప్పులే. మరి 53 వేల ఎకరాల్లో ప్రపంచ రాజధాని నిర్మించాలని బాబు కలలు కన్నారు. ఎకరానికి రెండు కోట్లు వంతున అభివుధ్ది చేసేందుకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన లక్షా ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్నేళ్ళు పడుతుంది. ఎన్ని తరాలు అందుకోసం కాచుకుకూచోవాలి.
ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ వద్ద డబ్బులు లేవని నిండు సభలో ముఖ్యమంత్రి జగన్ కుండబద్దలు కొట్టారు. తనకు కూడా లక్షల కోట్లతో రాజధాని నిర్మించాలని ఉన్నా కూడా కుదిరే పని కాదనేశారు. అందుకోసమే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అందులో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ ప్రతిపాదన పట్ల ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఇపుడు ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఇక టీడీపీలో అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ నిర్ణయం భేష్ అనేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కోండ్రు మురళి సైతం తాజాగా జగన్ కి జై కొట్టేశారు. అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలలో రాజధాని పెట్టాలనుకోవడం మంచి నిర్ణయం అంటున్నారు కోండ్రు మురళి.
ఎప్పటికీ ఒకే ప్రాంతం అభివ్రుధ్ధి చెందాలా. అలా హైదరాబాద్ మోడల్ గా ఒక చోట అభివ్రుధ్ధిని కుప్పపోయడం పిచ్చి చర్య అంటూ డైరెక్ట్ గానే బాబు విధానాలపై హాట్ కామెంట్స్ చేశారు. అధికార వికేంద్రీకరణ చేయాలని ఆయన అంటున్నారు.
ఇక అమరావతి విషయంలోనూ కోండ్రు సంచలనాత్మకమైన వ్యాఖ్యలే చేశారు. లక్ష కోట్లు కాదు కదా పది లక్షల కోట్లు తెచ్చిపెట్టినా అమరావతి రాజధానిగా అభివ్రుధ్ధి కానే కాదని తేల్చేశారు. ఓ విధంగా టీడీపీ నాయకుల స్వప్నాన్నే కోండ్రు దారుణంగా విమర్శించేశారన్నమాట. ఇక మూడు రాజధానుల ఆవసరం గురించి తాము చంద్రబాబుని చెప్పి ఒప్పిస్తామని కూడా ఈ మాజీ మంత్రి అంటున్నారు.
కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కోండ్రు మురళి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆయన తాజా ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి టీడీపీ నేతల తీరు పట్ల అసంత్రుప్తిగా ఉన్న కోండ్రు మురళి రాజధాని అంశంతో ఒక్కసారిగా గర్జించేశారు. ఇదేనా బాబు వంటి వారికి వినిపిస్తుందా.. చూడాలి మరి.