ఎమ్బీయస్‍: కురుక్షేత్రంలో కర్ణుడి శూరత్వం ఎంత?

‘‘కర్ణుడి స్వభావం’’ వ్యాసానికి యిది కొనసాగింపు. కురుక్షేత్ర యుద్ధానికి పూర్వం జరిగిన రాయబారాల్లో సంజయుడు వచ్చి సంధి మేలని చెప్పాడు. భీష్మద్రోణులు కూడా అదే చెప్పారు. దుర్యోధనుడు ‘కర్ణుడు ఒక్కడుంటే చాలు, పాండవులను ఓడించడం…

‘‘కర్ణుడి స్వభావం’’ వ్యాసానికి యిది కొనసాగింపు. కురుక్షేత్ర యుద్ధానికి పూర్వం జరిగిన రాయబారాల్లో సంజయుడు వచ్చి సంధి మేలని చెప్పాడు. భీష్మద్రోణులు కూడా అదే చెప్పారు. దుర్యోధనుడు ‘కర్ణుడు ఒక్కడుంటే చాలు, పాండవులను ఓడించడం ఎంతసేపు?’ అన్నాడు. భీష్ముడు అది సహించలేక ‘కర్ణుడి బలపరాక్రమాలు అతి స్వల్పం’ అన్నాడు. దానికి కర్ణుడు ‘పరశురాముడు యిచ్చిన శాపాన్ని దైవకృప వలన అధిగమించేశాను. నన్ను అనవసరంగా శపించానని గురువుగారు బాధపడి, చాలా ప్రేమ చూపించి మరిన్ని అస్త్రశస్త్రాలు యిచ్చారు. అది తెలుసుకుని మాట్లాడండి.’ అని బదులిచ్చాడు. ‘ఇంద్రుడు నీకిచ్చిన శక్తి ఆయుధాన్ని, నీ వద్ద వున్న సర్పముఖ బాణాన్ని చూసి గర్విస్తున్నావేమో, కృష్ణుడి ప్రాపు వుండగా అవి అర్జునుణ్ని ఏదీ చేయలేవు’ అని హెచ్చరించాడు భీష్ముడు. దానితో పాటు ‘నువ్విలా ప్రగల్భాలు పలికి దుర్యోధనుణ్ని రెచ్చగొట్టడం అతన్ని మృత్యుముఖానికి నడపడం కాదా?’ అనేశాడు.

ఉన్నమాటంటే ఉలుకెక్కువ అంటారు. తను చేస్తున్న పనినే భీష్ముడు ఎత్తిచూపడంతో కర్ణుడు మండిపడి ‘నువ్వు జీవించి వుండగా నేను యుద్ధం చేయను.’ అంటూ సభలోంచి వెళ్లిపోయాడు. దీనివలన నష్టపోయేది దుర్యోధనుడే తప్ప భీష్ముడు కాదు. కానీ కర్ణుడి అహంకారం, మూర్ఖత్వం అతన్ని ఆ దిశగా ఆలోచింప చేయనీయలేదు. చిత్రమేమిటంటే యీ అస్త్రసన్యాసానికి దుర్యోధనుడు నొచ్చుకోలేదు. కృష్ణరాయబారం సమయంలో దుర్యోధనుడు కృష్ణుణ్ని బంధించి, యుద్ధమయ్యేవరకు బందీగా పెట్టాలనుకున్నాడు. అలా పాండవులకు అతను అందుబాటులో లేకుండా చేద్దామనుకున్నాడు. ఆ పనికి కర్ణుడు కూడా ఓ చెయ్యి వేశాడు.

అయినా రాయబారకార్యం అయిపోయాక కృష్ణుడు అతన్ని రథం ఎక్కించుకుని దూరంగా తీసుకుని వెళ్లి ఏకాంతంగా జన్మరహస్యం చెప్పి, పార్టీ ఫిరాయించమని ఆఫర్ యిచ్చినపుడు తిరస్కరించడంలో కర్ణుడి స్వామిభక్తి ప్రదర్శించాడు. ధర్మరాజు నాకు పట్టాభిషేకం చేసి రాజ్యం యిచ్చినా నేను దాన్ని దుర్యోధనుడికి యిచ్చేస్తా అన్నాడు. యుద్ధం అనివార్యమని తెలిసి, కుంతి వచ్చి బతిమాలినపుడు ‘నేను రాధేయుడనే కాని కౌంతేయుణ్ని కాను’ అనడంలో పెంచిన తలితండ్రుల పట్ల అభిమానం కనబరిచాడు. కుంతి పుత్రభిక్ష పెట్టు అని అడగలేదు. అయినా అర్జునుడు తప్ప తక్కిన పాండవులను చంపను అని తనంతట తానుగా మాట యిచ్చాడు. ఇవి చెప్పుకోదగ్గ సుగుణాలు.

ఇక యుద్ధప్రారంభంలో దుర్యోధనుడు భీష్ముణ్ని సర్వసైన్యాధ్యక్షుడిగా వుండమని కోరినప్పుడు భీష్ముడు ‘నేను పాండవులను చంపను కానీ రోజుకి పదివేల మంది చొప్పున పాండవసేనను నిర్మూలిస్తాను. ఈ కర్ణుడు నాతో స్పర్ధకు వస్తున్నాడు. అతనంత ఉత్సాహం చూపుతూండగా నువ్వు నాకు యీ బాధ్యతని అప్పచెప్పడం ఔచిత్యంగా వుంటుందా?’ అన్నాడు. కర్ణుడికి కోపం వచ్చింది. ‘ఈయన బతికుండగా నేను యుద్ధం చేయను. నేను అర్జునుణ్ని చంపినా ఆ ప్రతిష్ఠ కూడా భీష్ముడి ఖాతాలోకే వెళుతుంది.’ అని ఆవేశపడ్డాడు. దుర్యోధనుడు నచ్చచెప్పి భీష్ముణ్ని సర్వసేనాధిపతిగా, కర్ణుణ్ని సేనాధిపతుల్లో ఒకడిగా చేశాడు. యుద్ధరంగంలోకి దిగబోయేముందు భీష్ముడు కర్ణుణ్ని అర్ధరథుడిగా పేర్కొన్నాడు. ‘ఇతనికి దయాగుణం ఎక్కువ. అంత దయ కలిగినవాడు యుద్ధానికి పనికిరాడు. అస్త్రాలున్నా అవి శాపగ్రస్తాలు. అందువలన యితనికి ఆ స్థాయి మాత్రమే యిస్తున్నాను.’ అన్నాడు.

భీష్మనిర్ణయాన్ని సమర్థిస్తూ ద్రోణుడు ‘ఇతను టీమ్ లీడరు కాదు, విడిగా పోట్లాడి పేరు తెచ్చుకోవాలన్న ఉబలాటం ఎక్కువ. ఓడిపోయినపుడు పారిపోతూంటాడు. యుద్ధంలో అప్రమత్తత తక్కువ’ అన్నాడు. ఈ మాటలు విని కర్ణుడిలో కోపం ప్రజ్వరిల్లింది. ‘ఈ భీష్ముడు మందబుద్ధి. అతివృద్ధుడు కావడం చేత యిలా వదరుతున్నాడు. ఇతన్ని వదిలేయ్ దుర్యోధనా’ అన్నాడు. కానీ దుర్యోధనుడు భీష్ముణ్ని వదలలేకపోయాడు. అతను సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఆయుధం చేపట్టనని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు అన్నమాట ప్రకారం యుద్ధరంగానికి దూరంగా వున్నాడు. 8వ రోజు రాత్రి దుర్యోధనుడి వద్దకు వెళ్లి భీష్ముణ్ని తప్పిస్తే నేను ఒక్కడినే పాండవులను, వాళ్ల సైన్యాన్ని తుదముట్టించగలను అన్నాడు. అతను సైన్యాధ్యక్షుడైనపుడు ఏం ఊడబొడిచాడో చూస్తే యిది పూర్తి దంబప్రలాపమని అర్థమౌతుంది.

కర్ణుడు ఎగదోయడంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి ‘నువ్వు నీ ప్రతాపాన్ని పూర్తిగా ప్రదర్శించటం లేదు. నువ్వు తప్పుకుని కర్ణుడికి అవకాశం యివ్వు’ అనేశాడు. దాంతో రోషం వచ్చిన భీష్ముడు తొమ్మిదవ రోజున విజృంభించాడు. ఆ రాత్రి ధర్మరాజు వచ్చి శిఖండి గురించి కనుక్కోవడం, మర్నాడు భీష్ముడు అంపశయ్యపై వాలడం జరిగాయి. అప్పుడు కర్ణుడు యుద్ధంలోకి దిగాడు. ఆ విధంగా 18 రోజుల యుద్ధంలో 10 రోజుల పాటు కర్ణుడు దుర్యోధనుడికి తన సేవలు అందించలేక పోయాడు. దీనికి అతని అహంభావమే కారణం.

భీష్ముడు అంపశయ్యపై ఉన్నపుడు కర్ణుడు అతన్ని చూడడానికి వెళ్లాడు. పాదాలకు నమస్కరించాడు. అప్పుడు భీష్ముడు దగ్గరకు పిలిచి ఆత్మీయంగా మాట్లాడాడు. అతని జన్మరహస్యాన్ని చెప్పాడు. నీ పట్ల వాత్సల్యమే తప్ప మత్సరం లేదు అని చెప్పి, నీ బుద్ధి యిలా వుండడానికి కారణం నీ జన్మలో లోపం. కానీ నీ పరాక్రమం, బ్రహ్మణ్యత్వం, దానగుణం – వీటిని నేనెప్పుడూ కీర్తిస్తాను. నువ్వు అకారణంగా పాండవులను ద్వేషిస్తూ, దుర్యోధనుణ్ని రెచ్చగొట్టడం నచ్చక, శాంతి కోసం నిన్ను అదుపు చేయబోయాను. ఇప్పటికైనా కౌరవపాండవుల సఖ్యానికి ప్రయత్నించు అని హితవు చెప్పాడు. కానీ కర్ణుడు నా సేవాధర్మం నన్ను నిర్వర్తించనీయి అని చెప్పి వచ్చేశాడు. ‘నువ్వు అతిరథుడివి అయినా నేను అర్థరథుణ్ని చేశాను’ అని భీష్ముడు చెప్పలేదు.

భీష్ముని పతనానంతరం దుర్యోధనుడు తనను సైన్యాధిపత్యం స్వీకరించమంటే ‘నేను కాదు, ద్రోణుడే దానికి అర్హుడు’ అని కర్ణుడు అనడం విశేషం. అప్పటిదాకా ద్రోణుణ్ని తీసిపారేసినా, అప్పుడు మాత్రం గురువు ఔన్నత్యాన్ని అంగీకరించాడు. దానిలో వివేకం కూడా వుంది. ద్రోణుణ్ని పక్కకు పెడితే తన అధ్యక్షతన ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు మనస్ఫూర్తిగా యుద్ధం చేసేవారు కాదేమోనన్న బెరుకు కూడా కర్ణుడికి వుండి వుండవచ్చు. 14వ రోజున కర్ణుడు స్వయంగా భీముడి చేతికి చిక్కి ఘోరావమానానికి గురయ్యాడు. ప్రగల్భాలు పలకడం వేరు, ప్రతాపం వేరు. కర్ణుడు భీముణ్ని ఎప్పుడూ ఓడించలేక పోయాడు. ఆ రోజు రాత్రి యుద్ధంలో ఘటోత్కచుడు విజృంభించడంతో అతన్ని చంపడానికి, అర్జునుడికై కర్ణుడు దాచి పెట్టుకున్న యింద్రాయుధం ఖర్చయిపోయింది.

ఆ రాత్రి యుద్ధం తర్వాత కర్ణుడు గొప్పలు చెప్పుకుంటూ వుంటే, కృపుడు ‘నీ శూరత్వం కోరికలలోనే వుంది’ అని ఎద్దేవా చేశాడు. వెంటనే కర్ణుడు ‘నీ నాలుక కోస్తా’ అని తిట్టాడు. తన గురువుని అతను మర్యాద చేసిన తీరు అది. అర్జునుడు తన గురువులతో ఎప్పుడూ యిలా ప్రవర్తించలేదు. ద్రోణసంహారం తర్వాత 16వ రోజున కర్ణుడు సైన్యాధ్యక్షుడయ్యాడు. ఆ పదవిలో భీష్ముడు 10 రోజులుంటే, ద్రోణుడు 5 రోజులుంటే కర్ణుడున్నది రెండు రోజులే! ఆ తర్వాత శల్యుడున్నది ఒక్క రోజు! 16వ రోజు యుద్ధంలో కర్ణుడు భీకరంగా పోరాడుతూ నకుల, సహదేవ, ధర్మరాజులను ఓడించి, కుంతి కిచ్చిన మాట ప్రకారం వదిలేశాడు.

కానీ ఆ రోజు కౌరవసేన బాగా దెబ్బ తినడంతో దుర్యోధనుడికి కర్ణుడిపై విశ్వాసం సడలింది. ‘ఇవాళ్టిది వదిలేయ్, అశ్వహృదయం తెలిసిన శల్యుణ్ని నాకు సారథిగా అమర్చు. రేపు నా తడాఖా చూపిస్తా’ అన్నాడు కర్ణుడు. ‘నా చిత్తం వచ్చినట్లు మాట్లాడినా కర్ణుడు ఏమీ అనకూడదు’ అనే షరతుపై శల్యుడు సారథ్యానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు కర్ణుడు తన ప్రతాపాన్ని పరిపూర్ణంగా చూపించాడు. అది చూసి బెదిరిపోయిన ధర్మరాజు అర్జునుణ్ని నువ్వు చేతకానివాడివని నిందించాడు. దాంతో రోషపడిన భీమార్జునులు విజృంభించారు. ఆ రోజే భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చాడు. అర్జునుడు కర్ణుడి కొడుకు వృషసేనుణ్ని చంపాడు. కర్ణుడు యివి నివారించలేక పోయాడు.

చివరకు కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు సర్పముఖాస్త్రాన్ని వేసినపుడు కృష్ణుడు రథాన్ని తన పాదంతో నేలలోకి తొక్కడంతో దానిలోని సర్పం అర్జునుడి కిరీటానికి తగిలి, అర్జునుడు బతికిపోయాడు. ఇంతలో విప్రశాపం వలన కర్ణుడి రథచక్రం నేలలోకి కృంగింది. కర్ణుడు కిందకు దిగి ‘నువ్వు యిప్పుడు బాణం వేయడం ధర్మం కాదు’ అంటూ అర్జునుడికి ధర్మపన్నాలు చెప్పబోయాడు. అభిమన్య వధ సమయంలో తన ప్రవర్తన ఏ పాటి ధర్మబద్ధంగా వుందో అతనికి గుర్తు లేదు. పాండవులు కర్ణుడికి ఏ అపకారమూ చేయలేదు. కానీ కర్ణుడు పాండవులకు అపకారం చేస్తూనే వచ్చాడు. ద్రౌపది గుడ్డలూడదీయమని సలహా యిచ్చాడు కూడా. తన ప్రాణాల మీదకు వచ్చేసరికి నీతులు చెప్పబోయాడు. అందుకే కృష్ణుడు పాతవన్నీ గుర్తు చేసి ‘అప్పుడేమయింది నీ బుద్ధి?’ అనే ఎత్తిపొడిచి, అర్జునుడితో ‘సందేహించకు, బాణం వేసేయ్’ అన్నాడు. కర్ణుడు నేలకూలాడు.

మొత్తం మీద చూస్తే కర్ణుడు దుర్యోధనుడికి స్నేహితుడే తప్ప హితుడు కాదని అర్థమౌతుంది. అందుకే యుద్ధాగ్నిలో మిత్రుడితో పాటు మిడతలా కాలిపోయాడు. కర్ణుడి అహంభావం, మత్సరం అతని సద్గుణాలను డామినేట్ చేశాయని అర్థం చేసుకుంటే, దుష్టచతుష్టయంలో ఒకడని గుర్తు పెట్టుకుంటే అతనలాటి దుర్మరణం పొందడం సహజమే అనిపిస్తుంది. రచయితల్లో కొంతమంది తమ ప్రత్యేకతను చాటుకోవడానికి పురాణాల్లోని కొన్ని విషయాలు మరుగుపరిచి, దుష్టపాత్రలను హైలైట్ చేస్తూంటారు. అవి చదివి ఊరుకుని, సమగ్రరూపం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వాళ్లను ఆరాధించి, వాళ్ల పేర్లు పిల్లలకు పెట్టుకుంటే అవివేకం.

ఈ పురాణగాథలు నిజంగా జరిగాయా లేదా అనేది ఎవరూ చెప్పలేరు. నా ఉద్దేశంలో రామాయణం, భారతం, ఇలియడ్.. యిలాటివన్నీ మౌలికంగా, చిన్న స్థాయిలో నిజంగా జరిగివుంటాయి. అయితే కాలక్రమేణా వాటి గురించి చెప్పుకునేటప్పుడు అతిశయోక్తులు, ఉత్ప్రేక్షలు, కల్పనలు, మానవాతీత విన్యాసాలు, వరాలూ, శాపాలూ, దైవిక సంఘటనలు చేరి వుంటాయి. అందువలన అవి ఖండనమండనలకు గురవుతున్నాయి. కానీ పురాణాలన్నీ మానవస్వభావానికి దగ్గరగా వున్నాయి కాబట్టే యిప్పటివరకు రిలవెంటుగా వున్నాయి. ప్రతి జాతి తమకు సంబంధించిన పురాణాలను తెలుసుకోవాలి. అవి చెప్పిన మంచిచెడులను గ్రహించాలి. మన ప్రవర్తన ఎలా వుండాలో, ఎలా వుండకూడదో నిర్ధారించుకోవాలి. మూలరచనల్లో లేని విషయాలను ఊహించో, లేకపోతే వాటికి వికృతభాష్యాలు చెప్పో ప్రయోజనం లేదు. ఏది మూలరచనో తేల్చడం కూడా కష్టమైన పని. అందువలన స్థూలంగా పాత్రస్వభావాలను అర్థం చేసుకుని అవి అనుసరణీయమో కాదో ఎవరికి వారే తేల్చుకోవాలి.

ఈ వ్యాసరచనకు ‘మహాభారత వైజయంతి’లో డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య గారి వ్యాసం, సామవేదం షణ్ముఖశర్మగారు రాసిన ‘ఇదీ యథార్థ మహాభారతం’, లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్ వారు ప్రచురించిన సంస్కృతభారతానువాద పుస్తకాలు ఉపయోగపడ్డాయి. ఆయా రచయితలకు నా కృతజ్ఞతలు. (ఫోటో – బాలి లో డెన్‌పసార్ ఎయిర్‌పోర్టు వద్ద కర్ణఘటోత్కచ యుద్ధం విగ్రహం) (సమాప్తం) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

[email protected]