జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే వున్నాయి. ఆయన వ్యాఖ్యలు వ్యవస్థల నమ్మకాన్ని దెబ్బ తీస్తాయని ఓ ఎంపీ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు అంత శక్తి ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఉలిక్కి పడడం చూస్తే… ఆయన విమర్శల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మానవ హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు. మాటకున్న పవర్ ఏంటో జస్టిస్ చంద్రు వ్యాఖ్యలే నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జస్టిస్ చంద్రు విమర్శల నేపథ్యంలో ఆంధ్రాలో మానవ హక్కులపై విస్తృతమైన చర్చకు దారి తీసింది. విమర్శలు, ప్రశంసలు మొత్తానికి జస్టిస్ చంద్రు పేరు ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగుతోంది.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అందరికంటే ఎక్కువగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును బాధించినట్టు ఆయన ఆవేదనే తెలియజేస్తోంది. న్యాయమూర్తులపై రఘురామకృష్ణంరాజుకు ఎంత గౌరవం వుందో ఆ మధ్య నారా లోకేశ్‌తో వాట్సప్ చాటింగ్‌లో బయటపడిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతానికి వస్తే, జస్టిస్ చంద్రు వ్యాఖ్యలతో పాటు ఇటీవల ఆయన ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసాన్ని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
జస్టిస్ చంద్రు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలను తమ దృష్టికి తెస్తున్నట్లు రఘురామ లేఖలో ఎంతో బాధ్యతగా ప్రస్తావించడాన్ని చూడొచ్చు. గతంలో తమ పార్టీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి ప్రకటనలు చేశారని.. ఇప్పుడు జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని రఘురామ పేర్కొనడం గమనార్హం. న్యాయ వ్యవస్థపై వ్యూహాత్మకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. జస్టిస్ చంద్రుపై ఈయన గారి దాడి మాత్రం చాలా గౌరవప్రదమైంది మరి!
న్యాయ వ్యవస్థపై దూషణలు చేసిన సదరు ఎంపీపై ఇప్పటివరకు చర్యలు లేవని రఘురామ గుర్తు చేశారు. జస్టిస్ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు గౌరవనీయమైన సంస్థలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రఘురామ అభిప్రాయపడ్డారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ కుట్రపై సుమోటోగా విచారణ ప్రారంభించాలని రఘు రామ అభ్యర్థించారు.
జస్టిస్ చంద్రు లాంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి విమర్శలు చేస్తేనే గౌరవ సంస్థలు నమ్మకం పోయేంత బలహీన పునాదులపై ఉన్నాయా? అనేది ఇప్పుడు చర్చ. జస్టిస్ చంద్రుపై విమర్శల దాడి పెంచి, ఆయనకు మరింత పాపులారిటీ తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు, వ్యాసాన్ని గౌరవ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం వెనుక ఎవరి మెహర్బానీ కోసమనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.