ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, కావున మూడు రాజధానుల అవసరం ఎంతైనా ఉందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావచ్చని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై రాష్ట్రంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాయలసీమలోని వైసీపీ నేతలు సహజంగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలుకు రాజధాని వస్తుండడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సీమనేతలు నోరు మెదపడం లేదు. రాజధాని మాటెత్తితే ష్..గప్చిప్ అంటున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు హైదరాబాద్ నుంచి ప్రకటన విడుదల చేశాడు.
హైకోర్టు ఏర్పాటు చేయాలని తాను మొదటి నుంచి కోరుతున్నట్టు తెలిపాడు. రాష్ర్ట విభజన సమయంలోనే కందవోలులో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశానని తెలిపాడు. అలాగే వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నాడు.ఒక వైపు జగన్ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిచ్చితుగ్లక్ చర్యగా అభివర్ణించాడు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించడం ప్రాధాన్యం సంతరించుకొంది. రాయలసీమ టీడీపీలో పెద్దపెద్ద నాయకులున్నారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ, అనంతపురానికి వస్తే మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, జేసీ బ్రదర్స్, కడపలో మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి తదితర నాయకులు నోరు మెదపడం లేదు.
జగన్ నిర్ణయంపై రాయలసీమ వ్యాప్తంగా ప్రజల్లో సానుకూలత ఉందన్న విషయాన్ని టీడీపీ నేతలు పసిగట్టారు. అంతేకాకుండా తమకు కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని, జగన్‌లాంటి ధైర్యపరుడు తప్పితే మరొకరు ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి సాహసించలేరని జనం అభిప్రాయపడుతున్నారు.
ముందుగానే రాయలసీమలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే. గత ఐదేళ్లలో చంద్రబాబు అభివృద్ధి అంతా కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం చేశారనే అభిప్రాయం రాయలసీమ ప్రజల్లో బలంగా నాటుకొంది. ఆ అసంతృప్తే గత సార్వత్రిక ఎన్నికల్లో చూపింది. మళ్లీ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కంటే మౌనంగా ఉంటూ స్వాగతించడం మేలనే అభిప్రాయంతో టీడీపీ సీమ నాయకులున్నట్టు సమాచారం. అందుకే వారంతా మౌనం పాటించారు.