పింఛన్లు పోతున్నాయి.. ఒక్కసారి ఇటు చూడు జగన్!

రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఏరివేత మొదలైంది. వందలు, వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో అర్హులంతా అనర్హులుగా మారిపోతున్నారు. నవశకం సర్వేతో చాలా మంది పేదల కళ్లల్లో ఆనందం మాయమైపోయింది. నికరంగా నెల మొదటివారంలో ఠంచనుగా…

రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఏరివేత మొదలైంది. వందలు, వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో అర్హులంతా అనర్హులుగా మారిపోతున్నారు. నవశకం సర్వేతో చాలా మంది పేదల కళ్లల్లో ఆనందం మాయమైపోయింది. నికరంగా నెల మొదటివారంలో ఠంచనుగా వచ్చే పింఛన్ కాస్తా ఆగిపోతుందని ఆందోళనలో ఉన్నారు వీళ్లంతా. ప్రస్తుతం తయారవుతున్న లిస్ట్ ప్రకారం దాదాపు నూటికి 40మంది పింఛన్లకు దూరమవుతున్న పరిస్థితి.

మున్సిపాల్టీ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంతిల్లు ఉంటే పింఛన్ కి వారు అనర్హులు. సొంతిల్లు ఉండొచ్చు కానీ, అవి పిల్లలు లాగేసుకోవడంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు చాలామంది. వారందరూ అనర్హుల లిస్ట్ లోకి వెళ్లిపోయారు. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో.. తాజాగా ఈ పరిధిని 1000 చదరపు అడుగులకు పెంచారు.

ఇక గ్రామాల్లో పొలాల లెక్కలు తప్పుగా ఉండటంతో నిరుపేదలు సైతం పింఛన్లకు దూరమవుతున్నారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల్లో తప్పుల వల్ల, మెట్ట పొలం మాగాణిగా కనిపిస్తుంది. దీంతో మాగాణి 3 ఎకరాలే ఉండాలన్న నిబంధన ప్రకారం రైతులు పింఛన్లకు దూరమవుతున్నారు. కేవలం రికార్డుల్లో మాత్రమే కొందరి పేరిట పొలాలుంటాయి. అలాంటి వారు కూడా ఈసారి పింఛన్లకు దూరమవుతున్నారు.

మొత్తమ్మీద నవశకం సర్వేతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చేలా కనిపిస్తోంది. 3వేల రూపాయలకు పింఛన్ పెంచలేదని ఇప్పటికే చాలామంది అసంతృప్తితో ఉన్నారు, ఇప్పుడు అసలుకే మోసం రావడంతో ప్రజల్లో అసహనం తీవ్రస్థాయికి చేరుతోంది. దీన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయ విమర్శలు సంధిస్తోంది.

అసలీ కఠిన నిబంధనలు సీఎం జగన్ కి తెలిసే పెట్టారో, లేక అధికారుల అత్యుత్సాహమో తెలియదు కానీ, సామాన్యులు మాత్రం తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారు. ఇకనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పింఛన్ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.