సినిమా పనులు పూర్తయ్యాయి, మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి, నటీనటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చింది, రెమ్యునరేషన్ కూడా సెట్ అయిందని అంటున్నారు. అయినా సరే నిర్మాత అధికారికంగా హీరో పేరు ప్రకటించలేని పరిస్థితి. టాలీవుడ్ హిస్టరీలోనే ఇలాంటి సిచ్యుయేషన్ ఏ సినిమాకూ రాలేదు. రాకూడదు కూడా.
పింక్ రీమేక్ విషయంలో బాలీవుడ్ కి సంబంధించినవారు తప్ప.. ఇక్కడివారెవరూ నోరు మెదపని పరిస్థితి. కేవలం పవన్ కల్యాణ్ తో సినిమా తీయాలనే జీవితాశయంతోనే దిల్ రాజు ఈ సినిమా ఒప్పుకున్నారు కానీ, ఈ నాన్ కమర్షియల్ సబ్జెక్ట్ తో లాభాలు వస్తాయన్న నమ్మకం ఆయనకి ఏమాత్రం లేదని తెలుసు. అయితే పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఆయన సెట్స్ పైకి ఎప్పుడు వస్తారో తెలియదు కానీ, సినిమా రిలీజ్ టైమ్ కి మాత్రం కావాల్సినన్ని వివాదాలు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తూ జగన్ రెడ్డీ అని సాగదీస్తూ పలికే పవన్.. మరి అదే సామాజిక వర్గానికి చెందిన నిర్మాతతో తన రీఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఆక్షేపించాల్సిన అంశమేమీ లేదు కానీ.. ఎంటర్టైన్ మెంట్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లు కులాల గురించి మాట్లాడితే అది వారికీ, వారితో పాటు ఉన్నవారికీ నష్టం. దిల్ రాజుకు మనసులో ఈ టెన్షన్ కూడా ఉంది.
మూడు రాజధానుల విషయంలో వ్యతిరేకంగా ఉన్న పవన్ కల్యాణ్ పై ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. సినిమా విడుదల నాటికి ఈయన ఏం మాట్లాడతారో, పరిస్థితులు ఎలా రివర్స్ కొడతాయో అనే భయం కూడా దిల్ రాజులో ఉంది. ఎందుకంటే, గతంలో తెలంగాణ ఉద్యమం టైమ్ లో అదుర్స్ అనే సినిమా ఇలానే బుక్కయింది. తెలంగాణలో ఈ సినిమాను పూర్తిగా తొక్కేశారు.
ఈ విషయాలు పక్కనపెడితే.. రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ కాల్షీట్ల ప్రకారం సినిమా షూటింగ్ కి రాగలరా, లేక ఎప్పట్లానే తనకి రావాలనిపించినప్పుడు షూట్ కు వస్తారా అనేది ప్రధానమైన ప్రశ్న. పవన్ ఈసారి కూడా తన పాత వ్యవహారశైలినే కొనసాగిస్తే, అది దిల్ రాజుకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే, 2020లో కనీసం 6 సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ తో ఉన్నాడు దిల్ రాజు. ఈ ఏడాది మహేష్ బాబు వల్ల తన టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాడు, ఇప్పుడు పవన్ రూపంలో దిల్ రాజుకు ప్రమాదం పొంచి ఉంది.
ఎలా చూసుకున్నా, ఎట్నుంచి ఆలోచించినా ఇప్పుడు దిల్ రాజుకే ఇబ్బందికర పరిస్థితి. ఇండియన్-2 సినిమా టైపులో అయితే మధ్యలో డ్రాప్ అయ్యేవాడేమో. ఈ ప్రాజెక్టుకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. సో.. దిల్ రాజు ఇప్పుడు పూర్తిగా పవన్ పై ఆధారపడిపోయాడు. బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ లాంటోడే, పవన్ ను సెట్స్ పైకి తీసుకురావడం చాలా కష్టమంటూ స్పందించాడంటే, దిల్ రాజుకు ఇక చుక్కలే.