బీజేపీ నేత , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు ఈ నెల 23న వైసీపీలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దాదాపు చేరనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి ఆది సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి గురువారం జగన్‌ను అభినందించడం చూస్తే చేరిక ప్రచారం నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మినహా మిగిలిన ఆయన కుటుంబ సభ్యులంతా వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, అలాగే మిగిలిన సోదరులు రామాంజనేయరెడ్డి, జయరామిరెడ్డి, శివనారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, వారి బామ్మర్ది , జమ్మలమడుగు మున్సిపల్ మాజీ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైసీపీలో చేరనున్నారు.
జగన్ పిలిస్తే పోయేందుకు సిద్ధంః మాజీ మంత్రి సోదరుడు
సీఎం వైఎస్ జగన్ పిలిస్తే పార్టీలోకి చేరేందుకు సిద్ధమని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి అన్నారు. జమ్మలమడుగులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటగా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. అయితే ఆయన మరణానంతరం అనేక కారణాల వల్ల ఫ్యాక్టరీ నిలిచిపోయిందన్నారు.
ప్రస్తుతం వైఎస్సార్ తనయుడు, మన జిల్లా వాసి అయిన జగన్ తిరిగి శంకుస్థాపన చేసిన స్థలానికి సమీపంలోనే కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమన్నారు. ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి విజయవాడలో సీఎం సమక్షంలో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయన్నారు. అందులోనూ జగన్ స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని, దీనివల్ల మన జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. జగన్ చర్యలన్నీ చూస్తుంటే ముఖ్యంగా కడప జిల్లా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఏ పార్టీలో లేను
జగన్‌ను అభినందిస్తున్న నారాయణరెడ్డిని ఇంతకూ మీరు ఏ పార్టీలో ఉన్నారని విలేకరులు ప్రశ్నించగా తాను ఏ పార్టీలో లేనని జవాబిచ్చారు. మీరు , మీ సోదరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది కదా అని ప్రశ్నించగా…అవును జగన్ పిలిస్తే తప్పకుండా పోతామని స్పష్టం చేశారు. కాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇటీవల బీజేపీలో చేరడం గమనార్హం.