ఏ ఇంట్లో సమస్య వచ్చినా ఆ ఇంట్లో వాలిపోయి, ఆ ఇంటి వాడైపోయి, ఎంత మంచి వాడవురా అనిపించేసుకుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. శతమానం భవతి లాంటి ఫీల్ గుడ్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమా అందించిన సతీష్ వేగ్నిశ అందిస్తున్న సినిమానే 'ఎంత మంచి వాడవురా'. మెహరీన్ తో కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ఓ సాంగ్ బయటకు వచ్చాయి. టీజర్ క్లిక్ కావడంతో సినిమా మీద కాస్త అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రెండో సాంగ్ బయటకు వచ్చింది.
''..అవునో తెలియదు..కాదో తెలియదు…నీ నవ్వో ఏమో, మొగమాటం పోదా…వయసుకు మెలకువ రాలేదా..చెలిమి అంటే తమరికి చేదా..' అంటూ సాగిన ఈ పాటను సీతారామశాస్త్రి రాయగా, శ్రేయా ఘోషల్ ఆలపించారు. గోపీసుందర్ మెలోడి టచ్ తో కాస్త కొత్తగా వినిపించిన క్లాస్ ఇనుస్ట్రుమెంటేషన్ తో ఈ పాటకు ట్యూన్ చేసారు.
దర్శకుడు సతీష్ వేగ్నిశ కు సంగీత, సాహిత్యాలంటే కాస్త ఎక్కువ ప్రేమ. అందుకే మాంచి సాహిత్యం, సున్నితమైన ట్యూన్ వుండేలా చూసుకున్నారు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ గతంలో ఖాకీ లాంటి హిట్ సినిమాను అందించింది.ఇప్పుడు స్వంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎంత మంచి వాడవురా సినిమాను, శ్రీదేవీ మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ సారథ్యంలో అందిస్తున్నారు.