తమ సినిమాకు సరైన లాంచింగ్ వుండాలి అంటే నిర్మాతలు దిల్ రాజు వైపే చూస్తున్నారు. దిల్ రాజుకు అంటూ నమ్మకమైన బయ్యర్లు, స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వుండడం అన్నది కలిసి వచ్చింది. సినిమా మంచి చెడ్డలు పక్కన పెట్టి, దిల్ రాజు సినిమా అంటే ప్రతి ఏరియాకు ఓ ఫిక్స్ డ్ బయ్యర్ వున్నారు.
అందువల్ల రూపాయి ఎక్కువైనా, తక్కువైనా ఆయన దగ్గరకే సినిమాలు వస్తున్నాయి.డిసెంబర్ 25న దిల్ రాజు బ్యానర్ లో నిర్మించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదల వుంది.జనవరి 9న దర్బార్, పదిన ఆయన సమర్పిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', 11న అల వైకుంఠపురములో సినిమాలు వున్నాయి.
ఈ సినిమాలు అన్నీ నైజాం, విశాఖల్లో దిల్ రాజే విడుదల చేస్తున్నారు. 15న ఎంత మంచి వాడవురా సినిమా కూడా నైజాంలో దిల్ రాజే టేకప్ చేస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలో కన్నడం, తెలుగు భాషల్లో తయారైన భారీ ప్రామిసింగ్ సినిమా అతడే శ్రీమన్నారాయణ కూడా దిల్ రాజు చేతిలోకి వచ్చింది.
కన్నడలో పాపులర్ హీరోల్లో ఒకరైన రక్షిత్ శెట్టి హీరోగా తయారైన సినిమా అతడే శ్రీమన్నారాయణ. కేజిఎఫ్ తరువాత భారీ వ్యయంతో నిర్మించిన సినిమా ఇది. తెలుగులో లవ్ వీ సినిమాతో పరిచయం అయిన శాన్వీ కథానాయికగా నటించింది ఇప్పటికే విడుదలైన ట్రయలర్ తెలుగునాట కూడా ఆసక్తి రేకెత్తించింది.
ఇటీవల ఫైనల్ కాపీ చూసిన దిల్ రాజు ఈ సినిమాను కూడా తన చేతుల్లోకి తీసుకున్నారు.జనవరి 1న న్యూ ఇయర్ రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.జనవరి 9 వరకు సరైన సినిమాలు లేవు అనుకుంటున్న తరుణంలో ఈ భారీ సినిమా వస్తోంది. ఇది కనుక క్లిక్ అయితే పండగ వరకు లాగేసే అవకాశం వుంది. పుష్కర్ మల్లికార్జునయ్య ఈ సినిమాకు నిర్మాత.