యంగ్ హీరో నితిన్ ఫుల్ స్పీడ్ మీద వున్నారు. చేతిలో మూడు సినిమాలు వున్నాయి. మూడూ కూడా సమాంతరంగా షూట్ లో వున్నాయి. వెంకీ కుడుమల 'భీష్మ' సినిమా పూర్తి కావచ్చింది. వెంకీ అట్లూరి 'రంగ్ దే' సినిమా ఓ షెడ్యూలు ఫినిష్ చేసుకుంది. చంద్రశేఖర్ యేలేటి 'చదరంగం' సినిమా సగానికి పైగా పూర్తయింది. ఇలాంటి నేపథ్యంలో ఎప్పటి నుంచో వార్తల్లో వున్న ప్రాజెక్టు ను ఈ రోజు ఫైనల్ చేసారు.
దర్శకుడు కృష్ణచైతన్య తయారుచేసిన పవర్ పేట స్క్రిప్ట్ ను నితిన్ చేయబోతున్నారు. ఈ సినిమాను నిర్మించడానికి పీపుల్స్ మీడియా సంస్థ రంగంలోకి దిగింది. ఇటీవలే వెంకీమామ సినిమాను అందించి, త్వరలో నిశ్శబ్దం సినిమాను విడుదల చేయబోతోందీ సంస్థ. అలాగే నిఖిల్-చందు మొండేటి కాంబినేషన్ లో కార్తికేయ 2 సినిమాను నిర్మించ బోతోంది.
ఇప్పుడు మరో ప్రాజెక్టుగా నితిన్ 'పవర్ పేట' ను ఈ రోజు ఫైనల్ చేసారు. పవర్ పేట సబ్జెక్ట్ ను రెండు భాగాలుగా తయారు చేసారు డైరక్టర్ కృష్ణ చైతన్య. అయితే ఏ భాగానికి ఆ భాగమే ఫుల్ గా వుంటుంది. అంతే తప్ప సీరియల్ గా వుండదు. ఫిబ్రవరి నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.
ఈ సినిమా తరువాత తన స్వంత బ్యానర్ మీద అంథాదూన్ రీమేక్ ను స్టార్ట్ చేస్తాడు నితిన్.