సుజనాచౌదరి… పేరులో తప్ప వెంట ఒక్క మనిషి కూడా లేని జాతీయస్థాయి నేత. సుజనాతో పాటు అన్నివేళలా నడిచే ఒకేఒక్క వ్యక్తి. అదీ ఆయన నీడ మాత్రమే. టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన నేత. ఓ పర్యాయం టీడీపీ తరపున మోడీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వ్యాపారవేత్త కమ్ రాజకీయ నాయకుడు. కేంద్రంలో రెండోసారి మోడీ సర్కార్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం, రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలు కావడం తెలిసిందే.
అధికారాన్ని రుచి మరిగిన టీడీపీ రాజ్యసభ సభ్యులు…ప్రతిపక్ష పాత్రలో ఇమడలేక వెంటనే ఓ నలుగురు సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు.వారిలో ప్రముఖుడు సుజనాచౌదరి. బీజేపీలో చేరి కాషాయ ధారణ చేసినా….పసుపు బుద్ధులు పోలేదు. మనిషి మాత్రమే బీజేపీలో, మనసు మాత్రం టీడీపీనే అన్నట్టుగా సుజనా చౌదరి రాజకీయ విమర్శలు చేస్తున్నాడు.
ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో బీజేపీ, ఆంధ్రాలో మాత్రం టీడీపీ. ఏపీలో చంద్రబాబును వీడి ఇతర పార్టీల్లోకి పెద్ద ఎత్తున వెళుతున్నసందర్భంలో వెంటనే సుజనాచౌదరి సీన్‌లోకి వస్తాడు.ఏపీ అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని, తమతో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చుతాడు. అసలే ఎద్దు ఈనిందంటే గాటిన కట్టేయమనే చందాన…బీజేపీతో టచ్‌లో ఉన్న వైసీపీ నేతలంటూ ఎల్లో మీడియా కథనాలను వండివారుస్తుంది.
ఇది బాబు మార్క్ డైవర్ట్ పాలిటిక్స్. దీన్ని బీజేపీలోని సుజనాతో బాబు దిగ్విజయంగా నడిపిస్తున్నాడు.జగన్ సర్కార్ ఏపీలో మూడు రాజధానులు ఉండాలనే నిర్ణయంపై బీజేపీ నేతలందరూ హర్షిస్తూ, ఆహ్వానిస్తూ ఉంటే…ఒక్క సుజనా చౌదరి మాత్రం వార్నింగ్ ఇస్తున్నాడు. జగన్ సర్కార్‌కు వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. అలాగని ఇదే చివరిసారి కూడా కాదు.
ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం చూస్తే ఊరుకోదని ఆయన హెచ్చరించాడు. సీఎం జగన్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే కుదరదన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లల ఆటల్లా రాజధాని మారుస్తామనడం తగదని హితవు పలికాడు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది ఉండదని ఆయన తీర్పులిస్తున్నాడు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ మాత్రం రాజధానిపై భిన్నమైన వాదన వినిపిస్తున్నాడు.రాజధాని ఎక్కడ ఉండాలి? ఎన్ని ఉండాలి? అనే అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలని, దాంట్లో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశాడు.
మరి సుజనాచౌదరి కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించడం ఏంటి? కేంద్రమంటే తానే అనుకుంటున్నాడా లేక చంద్రబాబు అని మాట్లాడుతున్నాడా? కేవలం టీడీపీని కాపాడేందుకు, చంద్రబాబు భజన చేసేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు సుజనా (భజన) చౌదరి వస్తారనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది.