అమరావతి రైతుల ఆందోళన వెనుక…

రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మొత్తం 29 గ్రామాల్లో ఈ రోజు బంద్‌ కొనసాగుతోంది. రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు రైతులు. ఆందోళన చేస్తున్నవారంతా రైతులేనా.? అన్న ప్రశ్న అధికార పార్టీ…

రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మొత్తం 29 గ్రామాల్లో ఈ రోజు బంద్‌ కొనసాగుతోంది. రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు రైతులు. ఆందోళన చేస్తున్నవారంతా రైతులేనా.? అన్న ప్రశ్న అధికార పార్టీ నుంచి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాటల్ని నమ్మి తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవం.

'చంద్రబాబు, రాష్ట్రాన్ని సింగపూర్‌తో పోల్చితే.. వైఎస్‌ జగన్‌ మాత్రం సౌతాఫ్రికాతో పోల్చుతున్నారు..' అంటూ కొందరు రైతులు ఎద్దేవా చేస్తున్నారు. రైతుల విమర్శల్లో ప్రతిపక్షం టీడీపీ భావజాలం స్పష్టంగా కన్పిస్తోంది.రైతుల్లో టీడీపీ మద్దతుదారులు వుండొచ్చుగాక.. అది వేరే విషయం. కానీ, అమరావతిలో గడచిన ఐదేళ్ళలో ఏం అభివృద్ధి జరిగింది.? అన్న విషయాన్ని కూడా అక్కడే వుంటోన్న రైతులు ఆలోచించుకోవాలి కదా.!

అసెంబ్లీ సాక్షిగా రాజధానిపై చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటన చేయకముందే అమరావతిలో భూముల ధరలు పెరిగాయి.. అధికార పార్టీ సానుభూతి పరులు పెద్దయెత్తున భూముల్ని కొనుగోలు చేశారు. అంతకు ముందు వరకూ లక్షల్లో పలికిన భూముల ధరలు అమాంతం కోట్లకు పడగలెత్తాయి. కానీ, ఆ సొమ్ముల్లో సాధారణ ప్రజలకు దక్కింది ఎంత.?

ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూముల్ని లాక్కున్న ప్రభుత్వం, ఈ క్రమంలో రైతుల్ని బలవంతం పెట్టిన సందర్భాలు అన్నీ ఇన్నీ కావు. పంటలు తగలబెట్టి మరీ అప్పటి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వానికి ఆ భూములు చెందేలా చేశారన్నది నిర్వివాదాంశం. అదిగో సింగపూర్‌, ఇదిగో జపాన్‌.. అంటూ ప్రపంచంలోని మేటి నగరాల్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తూ వచ్చారు. సినీ దర్శకుడు రాజమౌళితోనే పబ్లిసిటీ స్టంట్లు చేశారు చంద్రబాబు.

కేంద్రం డబ్బులెలా ఇస్తుంది.? కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితేంటి.? అన్న కనీస ఆలోచన చేయకుండా రాష్ట్ర రాజధానికి లక్ష కోట్లపైన వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేసుకున్న చంద్రబాబు, ఆ తర్వాత చేతులెత్తేశారు. నాలుగేళ్ళలో కనీసం శాశ్వత అసెంబ్లీని కూడా నిర్మించలేకపోయారు. ఇవన్నీ రైతులు గమనించడంలేదా.? గమనించినా, చంద్రబాబు మాయలోంచి ఇంకా బయటపడటంలేదని అనుకోవాలా.?

రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులతో అమరావతిలో కొన్ని భవనాల నిర్మాణం జరిగిన, జరుగుతున్న మాట వాస్తవం. అందులో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు వంటివి వున్నాయి. అవిప్పుడు కాలగర్భంలో కలిసిపోవు. వాటిని ఏదో రకంగా ప్రభుత్వం వినియోగించుకుంటుంది. అమరావతిలో రాజధాని కొనసాగించాలంటే.. వేల కోట్లు వెచ్చించాల్సిందే.

కేంద్రం, రాష్ట్రానికి ఏ విధంగానూ సహాయ సహకారాలు అందిచంచని ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకుని పరిపాలన చేయడమే మేలు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆలోచన కూడా అలాగే వున్నట్లు కన్పిస్తోంది.నిజానికి, చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించి మొట్టమొదటగా చేయాల్సిన పని అది.

ఆ తర్వాతే కొత్త రాజధాని గురించి ఆయన ఆలోచించి వుండాలి. చంద్రబాబు చేసిన తప్పిదాన్ని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సరిచేస్తున్నారనే విషయం రాజధాని రైతులు అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే, ఈ ఆందోళనలు రాష్ట్రాన్ని మరింత వెనక్కి నెట్టేస్తాయి. అది రాష్ట్రానికి ఏ రకంగానూ మంచిది కాదు. తమ సమస్యల పరిష్కారం కోసం, తమ భూముల కోసం రైతులు ఆందోళనలు చేస్తే, ఆ ఆందోళనల్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకునే పరిస్థితి వుండదుగాక వుండదు.