కెనెడాలో ఖలిస్తానీ ఉద్యమనాయకుడు నిజ్జార్ హత్య జరిగిన తర్వాత.. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక భారత అధికారుల హస్తం ఉన్నదని ఆరోపించిన కెనెడా ప్రధాని ట్రూడో.. ఆ దేశంలోని భారత ప్రభుత్వ ప్రతినిధుల్ని వెలివేశారు. దానికి జవాబుగా మోడీ కూడా భారత్ లోని కెనెడా ప్రతినిధుల్ని వెలివేయడంతో పాటు, కెనడా వారికి వీసాల జారీని కూడా నిలుపుదల చేశారు. ఇరుదేశాల మధ్య నిజ్జార్ హత్య పర్యవసానంగా.. విభేదాలు, ఉద్రిక్తతలు, శత్రుత్వమూ చోటుచేసుకుంటోంది.
నిజ్జార్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉన్నదని అర్థం వచ్చే వ్యాఖ్యలకు అధికారికంగా ప్రభుత్వ స్పందన స్పష్టంగా లేదు. అయితే.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాత్రం.. ఆ హత్య తాలూకు క్రెడిట్ ను పూర్తిగా మోడీ ఖాతాలో వేయడానికి తపన పడుతున్నారు. ఆయన ఒక పత్రికలో రాసిన వ్యాసంలో ‘నిజ్జార్ హత్యలో భారత్కు సంబంధం ఉన్నదన్న ఆరోపణలను పక్కనపెడితే ఏ దేశమూ తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను సహించబోదు.’ అనే వాక్యం ద్వారా.. ఏదేశమైనా తమకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను ఖండిస్తుందని, వారిని చంపేస్తుందని అన్యాపదేశంగా చెప్పడాన్ని గమనించాలి.
అలా దేశ ప్రభుత్వాలు, ఇతర దేశాల్లో చేయించే హత్యలకు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ‘మోదీ నాయకత్వంలో భారత్ ఎంత మాత్రమూ మెతకగా వ్యవహరించదని ప్రపంచంలో అనేక దేశాలకు తెలుసు’ అనే మాట ద్వారా సత్యకుమార్.. మోడీ సర్కారు ఖచ్చితంగా, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదుల్లో ఇతరదేశాల్లో నివసిస్తున్నా సరే.. వారిని హత్య చేయిస్తుందని, అది మోడీ ఘనత అని చాటిచెప్పుతున్నట్టుగా ఆ వ్యాసం ఉంది.
అయితే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాటుకోవడం లేదు. లాడెన్ ను అమెరికా హత్య చేయించినా.. దానిని బహిరంగంగానే ఉంచుకున్నారు. భారత్ దాపరికం మెయింటైన్ చేస్తోంది. లేదా సత్యకుమార్ వ్యాసం లాంటి రూపాల్లో.. మోడీనే నిజ్జార్ ను హత్య చేయించినట్లుగా ఇండైరక్టుగా లీకులు ఇస్తున్నారేమో తెలియదు.
ఇలాంటి లీకులకు ప్రజల స్పందన ఎలా ఉంటుందో గమనించిన తర్వాత.. దేశ ప్రజలు హర్షిస్తున్నారని అనుకుంటే.. అప్పుడు ప్రభుత్వమే ఒక అధికారిక ప్రకటన చేయొచ్చు. నిజ్జార్ హత్యను తామే చేయించామని, భారత సార్వభౌమధికారానికి, సమగ్రతకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడ ఏ కుట్రలు జరిగినా వాటిని భారత్ సహించబోదని.. జాతీయ వాదుల వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఆవేశపూరిత ప్రకటనలు చేయవచ్చు.
మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్న పార్టీకి.. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో ఇలాంటి వ్యవహారం ఒకటి ఇప్పుడు చాలా పెద్ద అవసరం కూడా అయిఉండొచ్చు.