Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ లో ఈ పైత్యం ఒక అంటు రోగం!

టాలీవుడ్ లో ఈ పైత్యం ఒక అంటు రోగం!

మంచు విష్ణు తాజాగా తన కలల ప్రాజెక్టుగా కన్నప్ప చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు కుటుంబం శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినవారు. కన్నప్ప అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తి పౌరాణిక చరిత్రలో ఒక అద్భుతమైన భాగం. 

శ్రీకాళహస్తీశ్వరుడు భక్త సులభుడు అనే నమ్మకం ప్రజల్లో కలిగితే గనుక  దానికి మూలం కన్నప్ప చరిత్ర. ఆ రకంగా చూసినప్పుడు మంచు విష్ణు.. తన జీవితం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతం ఘనతను సెల్యులాయిడ్  ఫార్మాట్ లో చెప్పడానికి పూనుకోవడం అభినందించాల్సిన విషయం. కానీ కొన్ని సంగతులు గమనించినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

కన్నప్ప అనే శివ భక్తుడైన గిరిజనుడు ప్రస్తుత కడప జిల్లా ప్రాంతంలోని అడవులకు చెందిన వాడు. అడవులు కొండల్లో తిరుగుతూ శ్రీకాళహస్తి ప్రాంతంలోని అడవుల్లో శివలింగానికి భక్తుడైన వాడు. ఆ లింగాన్ని ఆరాధిస్తూ తన జన్మను చరితార్థం చేసుకున్నాడు. ఇది మౌలికమైన కథ.

అయితే ఈ చిత్రం షూటింగ్ ను న్యూజిలాండ్ లో ప్రారంభించారు. సినిమా ప్రారంభం అయింది గనుక, కన్నప్ప న్యూజిలాండ్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన భక్తుడుగా ఉండబోతున్నాడా అనే సందేహం ఎవరికైనా కలిగితే  ఆశ్చర్యం లేదు. కానీ,  శివలింగం ఉన్న చిక్కటి అడవులను నేపథ్యం కోసం న్యూజిలాండ్  ను ఎంచుకున్నారేమో అనుకోవచ్చు. 

కడప జిల్లా నుంచి శ్రీకాళహస్తి వరకు ఉన్న అడవులకు.. న్యూజిలాండ్ అడవులు ఏ రకంగా సారూప్యత కలిగి ఉంటాయని మంచు విష్ణు, సినిమా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అనుకున్నారో మనకు తెలియదు. అయితే సినిమా బడ్జెట్ పెంచుకోవడానికి, వందల కోట్ల రూపాయలతో సినిమా నిర్మించినట్లుగా చాటుకోవడానికి ఇలాంటి  అనవసరమైన, అభూత కల్పనల వంటి, వాస్తవిక నేపథ్యాలను వక్రీకరించేటువంటి ప్రయత్నాలు ఉపయోగపడతాయి.

సుకుమార్ రూపొందించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో శేషాచలం అడవులకు మాత్రమే పరిమితమైన ఎర్రచందనం గురించి సినిమా తీస్తూ.. శేషాచలం ప్రాంతంలో ఒక్క ఫ్రేమ్ కూడా షూట్ చేయకుండా సినిమాలు రక్తి కట్టించడం అనే ఘోరమైన ప్రక్రియను  సుకుమార్ నిరూపించారు.  

కల్పిత కథలను రూపొందిస్తున్నప్పుడు మేకర్స్ ఎలాంటి లిబర్టీ తీసుకున్న పరవాలేదు. కానీ, భౌగోళిక నేపథ్యం ఉన్న ఎర్రచందనం కథను.. పౌరాణిక నేపథ్యం ఉన్న కన్నప్ప కథను చిత్రీకరించేటప్పుడు వాటి మూలాల్లోని నేపథ్యాలకు విలువ ఇవ్వాలి.  

పుష్ప ఎంత పెద్ద హిట్ అయినా సరే.. అది వాస్తవ దూరమైన చిత్రమే అని చెప్పాలి. మేకింగ్ లో ఇలాంటి పైత్యపు పోకడలు.. టాలీవుడ్ లో ఒక అంటూ రోగం లాంటివి. అలాంటి పైత్యం సోకడం వల్లనే.. శ్రీకాళహస్తి శివుడు భక్తుడు అయిన కన్నప్ప కథ న్యూజిలాండ్ లో తయారవుతోంది. 

కడప, చిత్తూరు జిల్లాలలో ఎంతో చిక్కనైన, కథలోని నేపథ్యానికి తగిన అడవులు  ఎన్నో ఉన్నాయి. షూటింగులకు పేరు మోసిన తలకోన ప్రాంతంలో.. కొత్త లొకేషన్స్ ఎంచుకొని చేసిన ఎంతో సబబుగా ఉండేది. కానీ న్యూజిలాండ్ లో మొదలెట్టడం ఆశ్చర్యకరం. సినిమా మేకింగ్ కు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన మంచు విష్ణు  కానీ ఒక లీక్ ఇచ్చారు. 600 మంది ఎన్నో త్యాగాలు చేసి కన్నప్ప కోసం న్యూజిలాండ్ వచ్చారని వెల్లడించారు.

త్యాగాలు అనగా మంచు విష్ణు చెప్పదలుచుకున్న భావం ఏమిటో మనకు అర్థం కాదు. పాపం వారికి రెమ్యూనరేషన్ లు ఉన్నాయో.. గొప్ప కలల ప్రాజెక్టులో భాగం అయ్యారు అనే కీర్తి కోసం  వేతనాలను త్యాగం చేశారో ఏమో మరి.

న్యూజిలాండ్ షూటింగ్ పుణ్యమా అని, 600 మంది త్యాగాల విలువను కూడా కలిపి.. ఈ సినిమాకు ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినట్లుగా లెక్కలు తయారు చేస్తారో వేచి చూడాలి. కథకు అనవసరమైన, ఆర్భాటంతో కూడిన హంగులు.. కథలోని వాస్తవిక నేపథ్యాన్ని చంపేసే అతిశయమైన గిమ్మిక్కులు అనే అంటురోగం టాలీవుడ్ ను ఎప్పటికీ విడిచి పెడుతుందో తెలియాలంటే ఇంకా ఎక్కువ కాలం నిరీక్షించాలి.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా