దక్షిణాదిన సినీ వారసత్వంలో హీరోయిన్ అమ్మాయిల్లో కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. తెలుగు సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కల్యాణి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్ గా వెలిగిన ప్రియదర్శన్ కూతురే కల్యాణి అని వేరే చెప్పనక్కర్లేదు. ఇక కల్యాణి తల్లి కూడా సినీ వ్యక్తే.
బోలెడన్ని తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించిన లిజి కూతురు అయిన కల్యాణి.. తన ఇంటర్వ్యూలో తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. కల్యాణిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీడియా తప్పకుండా ఆమె తల్లిదండ్రుల గురించి అడుగుతుంది. అది మామూలుగా కాదు. వారి విడాకుల గురించి.
మూడేళ్ల కిందట ప్రియదర్శన్, లిజిలు విడిపోయారు. ఇరవై నాలుగేళ్ల పాటు వైవాహిక బంధంలో ఉండి వారు విడిపోయారు. ఆ అంశం గురించి వారు చెప్పాల్సింది చెప్పారు. ప్రియదర్శన్ ఆ అంశం గురించి పెద్దగా మాట్లాడలేదు. లిజి మాత్రం ఒక గతుకుల దారి ప్రయాణాన్ని ఆపేసినట్టుగా చెప్పింది. తమ వైవాహిక బంధం చాలా కాలం పాటు ఇబ్బందులను ఎదుర్కొందని, అదొక గతుకుల రోడ్డు ప్రయాణంగా సాగిందని.. అందుకే దాన్ని ముగించినట్టుగా లిజి చెప్పింది.
ఇక ఈ అంశం మీద ఇది వరకూ పలు సార్లు స్పందించడానికి నిరాకరించింది కల్యాణి. పదే పదే తనను ఆ విషయం గురించి అడగవద్దని ఆమె తేల్చి చెప్పింది. అయితే తాజాగా మరోసారి ఆమె ఆ విషయం గురించి స్పందించింది. తన తల్లిదండ్రుల విడాకుల అంశం తనకు షాక్ ను ఇచ్చిందని కల్యాణి చెప్పింది. అయితే వారు విడిపోయాకా.. ప్రశాంతంగా ఉన్నారని, కాబట్టి హ్యాపీ అని పేర్కొంది.