ఔను.. విశాఖపై చంద్రబాబు అక్కసు ఈనాటిది కాదు.!

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరు ప్రకటితమవబోతోందా.? అంటే, ప్రస్తుత పరిస్థితులు 'ఔను' అనే సంకేతాలే పంపుతున్నాయి. చూచాయిగానే అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెరపైకి తెచ్చిన 'మూడు రాజధానుల ఆంధ్రప్రదేశ్‌'…

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరు ప్రకటితమవబోతోందా.? అంటే, ప్రస్తుత పరిస్థితులు 'ఔను' అనే సంకేతాలే పంపుతున్నాయి. చూచాయిగానే అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెరపైకి తెచ్చిన 'మూడు రాజధానుల ఆంధ్రప్రదేశ్‌' కాన్సెప్ట్‌, విశాఖపట్నం కేంద్రంగా పాజిటివ్‌ సంకేతాల్ని పంపుతోంది.

అయితే, అమరావతి కేంద్రంగా మాత్రం పెద్ద రచ్చే జరుగుతోంది ఈ కాన్సెప్ట్‌పై. విశాఖను అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భావిస్తే, అది నేరమెలా అవుతుంది.?'ముఖ్యమంత్రి విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తారా.? ఇది తుగ్లక్‌ చర్య..' అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఉత్తరాంధ్రలో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలు.

రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం విశాఖ, ఉత్తరాంధ్రలోనే వున్నా.. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోయిందంటే.. దానిక్కారణం పాలకులే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో విశాఖ దశ తిరుగుతుందని అంతా అనుకున్నారు.కానీ, చంద్రబాబు నిర్ణయాల కారణంగా అలా జరగలేదు.నిజానికి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐటీ (సాఫ్ట్‌వేర్‌) రంగం విశాఖ వేదికగా అనూహ్యమైన అభివృద్ధి చెందుతుందని చాలామంది భావించారు.

ఆ దిశగా అడుగులు ఎప్పుడో పడ్డాయి. కానీ, ఏం లాభం.? విశాఖను చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హుద్‌హుద్‌ తుపానుకి ముందు, ఆ తర్వాత.. అని చూసుకుంటే, విశాఖపై చంద్రబాబు చూపిన మమకారం ఏంటో అర్థమవుతుంది. ఐటీని అమరావతి వైపు మళ్ళించే ప్రయత్నం చేశారు.. విశాఖ వైపు చూస్తున్న సినీ పరిశ్రమని చంద్రబాబు పాలనలో అడ్డగించారు కూడా.

గతం గతః ఇప్పుడు విశాఖ విషయంలో ఉత్తరాంధ్ర వాసుల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. విశాఖ గనుక అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ అయితే నగరం అభివృద్ధి చెందుతుందనీ,ఆ అభివృద్ధి పొరుగు జిల్లాలకూ పాకుతుందనీ ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం కూడా భావిస్తున్నారు.

కానీ, చంద్రబాబు ఇక్కడా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు విశాఖ అంటే అంత అక్కసు.? ఉత్తరాంధ్ర విషయంలో చంద్రబాబు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు.?సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు, ఓ ప్రాంత ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా పదే పదే వ్యవహరించడం అత్యంత హేయం.