సీబీఐ విచార‌ణ‌కు ఇప్పుడు కాదు…మ‌రోసారి!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ‌కు రాలేన‌ని వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి తెలిపారు. వివేకా హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇటీవ‌ల సీబీఐ నుంచి…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ‌కు రాలేన‌ని వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి తెలిపారు. వివేకా హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇటీవ‌ల సీబీఐ నుంచి పిలుపు అందింది. గ‌త నెల‌లో అవినాష్‌రెడ్డి ఒక ద‌ఫా విచార‌ణ ఎదుర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే మ‌రోసారి పిలుస్తామ‌ని చెప్పిన‌ట్టు అప్ప‌ట్లో అవినాష్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఐదు రోజుల క్రితం ఈ నెల 23న భాస్కర్‌రెడ్డి,  24న అవినాష్‌రెడ్డి విచారణకు రావాలని సీబీఐ నుంచి నోటీసులు వెళ్లాయి.

దీంతో తండ్రీత‌న‌యుల విచార‌ణ ఉత్కంఠ రేపుతోంది. మ‌రీ ముఖ్యంగా వివేకా హ‌త్య కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో సంచ‌ల‌న విష‌యాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి ఇంట్లోనే కుట్ర‌కు తెర‌లేచిన‌ట్టు సీబీఐ త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో వాళ్లిద్ద‌రిని విచారించ‌డం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందోన‌నే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో ఉంది.

క‌డ‌ప లేదా హైద‌రాబాద్‌లో ఎక్క‌డైనా విచార‌ణ‌కు హాజ‌రు కావ‌చ్చ‌ని ఐదు రోజుల క్రితం సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ముంద‌స్తుగా నిర్ణ‌యించుకున్న కార్య‌క్ర‌మాలు ఉన్నందున విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని సీబీఐ అధికారుల‌కు వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి అప్పుడే స‌మాచారం ఇచ్చార‌ని తెలిసింది. మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని సీబీఐ అధికారుల‌కు ఆయ‌న విన్న‌వించారు. దీంతో మ‌రోసారి ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి, విచార‌ణ‌కు పిలుపించుకునే అవ‌కాశం ఉంది. వైఎస్ అవినాష్‌రెడ్డి మాత్రం రేపు విచార‌ణ‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.